Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్ నామినేషన్ల స్క్రూటినీలో హైడ్రామా..
ABN , Publish Date - Oct 22 , 2025 | 09:23 PM
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్ నామినేషన్ల ఘట్టమే రసకందాయమైంది. మొత్తం 211 మంది అభ్యర్థులు ఈ ఉపఎన్నికకు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత.. కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ నామినేషన్‌పై అభ్యంతరాలు..
హైదరాబాద్, అక్టోబర్ 22: హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్ నామినేషన్ల ఘట్టమే రసకందాయంగా మారింది. మొత్తం 211 మంది అభ్యర్థులు ఈ ఉపఎన్నికకు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, ప్రధాన అభ్యర్థులైన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత.. కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ నామినేషన్‌పై అభ్యంతరాలు లేవనెత్తడంతో వాతావరణం మరింత వేడెక్కింది. రిటర్నింగ్ అధికారి రెండు పార్టీల అభ్యర్థుల నామినేషన్లను ధృవీకరించడంతో ఈ వివాదం కొలిక్కివచ్చింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ సీట్ కోసం ఎన్నిక నవంబర్ 11న జరగనుంది. ఐటీ, ఫైనాన్షియల్ హబ్‌గా పేరుగాంచిన ఈ నియోజకవర్గం, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. మాజీ క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజ్హరుద్దీన్‌ను (కాంగ్రెస్) 16,337 ఓట్ల తేడాతో ఓడించారు. జూన్ 8న గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో ఈ సీట్ ఖాళీ అయింది.
బీఆర్ఎస్, సానుభూతి ఫ్యాక్టర్‌ను అనుకూలంగా మార్చుకోవాలని గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బరిలోకి దిగారు. యువనేత వి.నవీన్ యాదవ్‌ను కాంగ్రెస్ తమ అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ నుంచి, ఆ పార్టీ మాజీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తిరిగి బరిలో ఉన్నారు. ఈ బైపోల్‌కు అక్టోబర్ 15 నుంచి 21 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇచ్చారు.
ఈ క్రమంలో షేక్ పేట్ ఎంఆర్‌ఓ కార్యాలయంలో జరిగిన నామినేషన్ పరిశీలనలో హైడ్రామా నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన తరఫు న్యాయవాది ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ (ఫామ్ 2B)పై అభ్యంతరాలు లేవనెత్తారు. ఫామ్ 26 (అఫిడవిట్)లో మొదటి మూడు పేజీల కాలమ్‌లలో (వివరాలు నింపడం, ఆస్తి-ఆదాయ వివరాలు) తప్పులు ఉన్నాయని, నిర్దేశిత కాలమ్‌లు ఖాళీగా ఉన్నాయని వాదించారు. ఇదే కారణంతో పలు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారనీ ఆమె రిటర్నింగ్ అధికారి దృష్టికి తెచ్చారు.
రిటర్నింగ్ అధికారి పి.సాయిరాం ఈ అభ్యంతరాలను పరిశీలించారు. మొదట్లో నవీన్ యాదవ్‌ను కార్యాలయంలోనే ఆపి, విచారణ చేశారు. నామినేషన్ అంగీకరించకుండా 'మళ్లీ పిలుస్తాం' అని పక్కన పెట్టారు. అయితే, వివరాలను తనిఖీ చేసిన తర్వాత, నవీన్ యాదవ్ మూడు సెట్ల నామినేషన్లు, అఫిడవిట్లు సరైనవని ధృవీకరించారు. అలాగే, సునీత నాలుగు సెట్ల నామినేషన్లు కూడా ఆమోదయోగ్యమని ప్రకటించారు.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. 'నా మూడు సెట్ల నామినేషన్లు ఆమోదించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పనికిమాలిన అబ్జెక్షన్లు చేశారు. అఫిడవిట్లు సరైనవని ఆర్‌వో తెలిపారు. మేము ఎవరి అఫిడవిట్‌పై అభ్యంతరాలు లేవనెత్తలేదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తోంది. మేము ఎవరి పర్సనల్ విషయాలపై కామెంట్స్ చేయలేదు, చేయను. నా దృష్టి నియోజకవర్గ అభివృద్ధి మీదే. యువత, మహిళల అభివృద్ధికి పనిచేస్తాను' అంటూ నవీన్ స్పష్టం చేశారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ విత్‌డ్రా కోసం అక్టోబర్ 24 వరకు అవకాశం ఉంది. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. ఈ ఉపఎన్నిక కోసం 400 పోలింగ్ బూత్‌లకు అదనపు సిబ్బందిని కేటాయించారు.
ఇవి కూడా చదవండి..
అయ్యప్ప సేవలో ద్రౌపది ముర్ము.. శబరిమలను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి