Share News

HYDRA Commissioner: ప్రజలకు హైడ్రా కమిషనర్ కీలక సూచన

ABN , Publish Date - Aug 13 , 2025 | 05:55 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర ప్రజలకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక సూచన చేశారు. భారీ వర్షాలు నేపథ్యంలో అవసరమైతే తప్పా.. బయటకు రావద్దని ప్రజలను హెచ్చరించారు.

HYDRA Commissioner: ప్రజలకు హైడ్రా కమిషనర్ కీలక సూచన
HYDRA Commissioner AV Ranganath

హైదరాబాద్, ఆగస్ట్ 13: భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అవసరమైతే తప్పా.. బయటకు రావద్దని హైదరాబాద్ నగర ప్రజలకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. బుధవారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురవనున్నాయంటూ వాతావరణ శాఖ తెలిపిందని.. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన సూచించారు.


బుధవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో రంగనాథ్ మాట్లాడుతూ.. ఎంతటి విపత్తు ఎదురైనా.. వాటిని ఎదుర్కొనేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్, జలమండలి, విద్యుత్ అధికారుల సమన్వయంతో పని చేస్తున్నామని ఆయన వివరించారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు వస్తే.. ప్రజలను రక్షించేందుకు బోట్స్‌తో సహా అన్నింటిని సిద్ధం చేశామని చెప్పారు.


అయితే రాత్రి సమయంలో వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉండడంతో.. ఈ రోజు రాత్రి నుంచి హైడ్రా బృందాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. నాలాల కబ్జాల కారణంగానే రహదారులపైకి భారీగా వరద నీరు వస్తుందని ఆయన తెలిపారు. ఇక ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో దాదాపు 400కి పైగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయన్నారు. అలాగే మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ఇప్పటికే సిబ్బంది ఉన్నారన్నారు. ఒక వేళ భారీ వర్షాలు కురిస్తే.. సహాయక చర్యల్లో పాల్గొనాలని యువతకి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం

వదంతులు నమ్మకండి.. అప్రమత్తమైన ప్రభుత్వం

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 08:24 PM