Vangalapudi Anitha: వదంతులు నమ్మకండి.. అప్రమత్తమైన ప్రభుత్వం
ABN , Publish Date - Aug 13 , 2025 | 05:30 PM
భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. అలాంటి వేళ.. సోషల్ మీడియాలో వదంతులను నమ్మవద్దని ప్రజలకు హోమ్ మంత్రి అనిత్ సూచించారు.
అమరావతి, ఆగస్ట్ 13: ఒక వైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులోభాగంగా బుధవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో రాష్ట్ర హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అల్పపీడన ప్రభావంతో రేపు.. అంటే గురువారం కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అలాగే క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ అధికారులకు సూచించారు. వర్ష ప్రభావ ప్రాంతాల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఒక వేళ.. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగానికి ఆమె కీలక సూచనలు చేశారు.
ఇక సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలన్నారు. అయితే ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్, నెలకూలిన వృక్షాలను వెంటనే తొలగించాలని వారికి సూచించారు. విజయవాడలో ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,19,133 క్యూసెక్కులుగా ఉందని వివరించారు. వరద ప్రవాహం కారణంగా.. మొదటి ప్రమాద హెచ్చరిక వరకు నీరు చేరే అవకాశం ఉందన్నారు.
నదీ పరివాహాక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక ప్రమాద ప్రాంతాల్లో తప్పని సరిగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేయాలని సూచించారు. హోర్డింగ్స్, శిధిలావస్థలో ఉన్న భవనాలు, గోడలు, చెట్ల వద్ద ఉండరాదని ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి అనిత సూచించారు.
మరోవైపు భారీ వర్షాలు, అల్ప పీడనం ఏర్పడిన వేళ.. సోషల్ మీడియాలోని వదంతులను నమ్మవద్దంటూ ప్రజలకు ఆమె కీలక సూచన చేశారు. చాలా అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శి జి. జయలక్ష్మీ, డైరెక్టర్ ప్రఖర్ జైన్, కోస్తా జిల్లాల కలెక్టర్లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్
సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..
For More Andhrapradesh News And Telugu News