Hyderabad University Drugs Case: ప్రముఖ యూనివర్సిటీ డ్రగ్స్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
ABN , Publish Date - Aug 29 , 2025 | 03:34 PM
హైదరాబాద్ ప్రముఖ యూనివర్సిటీ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పుష్ప సినిమా తరహాలో డ్రగ్స్ స్మగ్లింగ్ జరిగినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్: ప్రముఖ యూనివర్సిటీ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు కూడా ఈ డ్రగ్స్ సరఫరా ముఠాల లక్ష్యంగా మారినట్టు పోలీసులు వెల్లడించారు. విచారణలో ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ, మట్టి గాజులు, ఆయుర్వేద ఉత్పత్తుల వంటి సాధారణ వస్తువుల మధ్య హెరాయిన్, ఎఫిడ్రీన్ ప్యాకెట్లు దాచి పంపుతున్నట్టు తేలింది. ‘పుష్ప’ సినిమా తరహాలో పుస్తకాలు, మెడిసిన్, గాజుల ముసుగులో డ్రగ్స్ ను కొరియర్ ద్వారా అక్రమంగా తరలించడాన్ని పోలీసులు గుర్తించారు.
మారుతీ కొరియర్స్ ద్వారా గంజాయి
తాజా విచారణలో ఓ ప్రముఖ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు, మారుతీ కొరియర్స్ ద్వారా ‘ఓజీ గంజాయి’ తెప్పించుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ నగర శివారులో ఉన్న మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలకు డ్రగ్స్ తరచూ కొరియర్ పార్సిల్ రూపంలో చేరుతున్నట్లు తెలుస్తోంది.
రూ.100 కోట్ల డ్రగ్స్ – 10 కొరియర్ సంస్థలు
గత రెండు సంవత్సరాల్లో 10కి పైగా కొరియర్ కంపెనీల ద్వారా సుమారు రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా అయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొరియర్ సంస్థలు కమీషన్ ఆశించి డ్రగ్స్ ముఠాలకు సహకరిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో కొన్ని కొరియర్ సంస్థలపైనా కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ సరఫరాలో వాటి పాత్రను నిశితంగా పరిశీలిస్తున్న పోలీసులు త్వరలో మరిన్ని అరెస్టులు చేసే అవకాశముందని తెలుస్తోంది.
స్పెషల్ పోలీస్ టీమ్..
హైదరాబాద్ నగరంలోని విద్యార్థుల్లో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. డ్రగ్స్ సరఫరాదారుల ముఠాలను ధ్వంసం చేయాలని సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లు సంయుక్తంగా పని చేస్తున్నాయి. విద్యాసంస్థల విద్యార్థులు కూడా ఈ మాదకద్రవ్యాల కుంభకోణంలో ఉండటం, కొరియర్ సంస్థలు సహకరిస్తుండటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం, పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read:
జియో ఐపీఓ సహా కొత్త యుగానికి రోడ్‌మ్యాప్..ముఖేష్ అంబానీ కీలక ప్రకటన
IRCTC కూర్గ్ టూర్ ప్యాకేజీ.. ప్రకృతి ప్రేమికుల కోసం స్పెషల్ ఆఫర్
For More Latest News