Outer Ring Road HMRL Expansion: ఔటర్ చుట్టూరా.. మెట్రో నిర్మిస్తే ఎంతో ప్రయోజనం
ABN , Publish Date - Nov 30 , 2025 | 08:58 AM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో మరిన్ని మున్సిపాల్టీలు, పంచాయితీలను విలీనం చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీంతో నగర విస్తీర్ణం మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా.. పలువురు నిపుణులు కీలక అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
నగరంలోకి వచ్చే వారికి సౌకర్యం
సిటీపై తగ్గనున్న వాహనాల ఒత్తిడి
బల్దియా విస్తరణకు జరుగుతున్న చర్యలతో సర్వత్రా ఆసక్తి
హైదరాబాద్, నవంబరు 29: బల్దియా విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఔటర్ చుట్టూరా మెట్రో రైలును పొడిగించే ప్రతిపాదన తెరపైకి వస్తోంది.ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీ.. త్వరలో 2 వేల చదరపు కిలోమీటర్ల పరిధికి విస్తరించనుంది. అందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాంతాలన్నింటినీ తెలంగాణ కోర్ ఆర్చ - రీజియన్ (టీసీయూఆర్)గా పేర్కొంటూ అభివృద్ధి చేయాలని భావిస్తోంది.
ఈ తరుణంలో ఔటర్ చుట్టూ మెట్రో మార్గాన్ని నిర్మించి అనుసంధానించడం ద్వారా జాతీయ రహదారుల నుంచి నగరంలోకి వచ్చే వాహనాలను శివారు పరిమితం చేయడం ద్వారా.. నగరవాసులకు మెరుగైన రవాణా వ్యవస్ధను అందించ వచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే ఆయా ప్రాంతాల ప్రజలకు, స్థానికులకు సులువైన, వేగవంతమైన ప్రయాణం అందెంచేందుకు మెట్రో అత్యంత కీలకంగా మారనుందని పేర్కొంటున్నారు. ఈ తరుణంలో రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులతోపాటు వాహన కాలుష్యాన్ని సైతం అరికట్టినట్లవుతుందని అభిప్రాయపడుతున్నారు.
రెండో దశలో 163 కిలోమీటర్లు..
విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లో మెట్రోను మరింతగా విస్తరించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ మేరకు రెండో దశలో పార్ట్-ఏ కింద 5 కారిడార్లు, పార్ట్-బీ కింద 3 కారి డార్లను చేపట్టనుంది. రూ.43.84 కోట్ల వ్యయంతో మొత్తం 8 కారిడార్లలో 163 కి.మీ.లలో నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆ ర్)లకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే కోరుతోంది. మెట్రో విస్తరణలో ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, కోల్‌కతా తర్వాత 5వ స్థానంలో హైదరాబాద్ ఉంది. దీనిని మొదటి స్థానానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
మూడో దశ కింద గతంలో ప్రతిపాదనలు..
మెట్రో మూడో దశ విస్తరణలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ల నుంచి నగరానికి వచ్చే ప్రజల కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు రూపొందించారు. ఓఆర్‌ఆర్ శంషాబాద్ జంక్షన్ (జాతీయ రహదారి 44) నుంచి తుక్కుగూడ, బొంగులూరు మీదుగా పెద్ద అంబర్‌పేట జంక్షన్ వరకు 40 కిలో మీటర్ల వరకు కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు అప్పట్లో ప్రకటించింది.
అలాగే ఓఆర్‌ఆర్ పెద్ద అంబర్‌పేట జంక్షన్ (జాతీయ రహదారి 65) నుంచి ఘట్‌కేసర్, శామీర్‌పేట్ మీదుగా మేడ్చల్ జంక్షన్ వరకు 45 కిలోమీటర్లు, మేడ్చల్ జంక్షన్ (జాతీయ రహదారి 44) నుంచి దుండిగల్ మీదుగా పటాన్‌చెరు జంక్షన్ (జాతీయ రహదారి 65) వరకు 29 కిలోమీటర్లు, పటాన్‌చెరు జంక్షన్ (జాతీయ రహదారి 65) నుంచి కోకాపేట మీదుగా నార్సింగి జంక్షన్ వరకు 22 కిలోమీటర్ల కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తన ప్రతిపాదనల్లో స్పష్టం చేసింది.
శివారులోని ఈ గ్రామాలకు ప్రయోజనం..
మెట్రో రెండో దశలోని పార్ట్-బీలో ఎయిర్‌పోర్టు- భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలోమీటర్లు మార్గాన్ని ప్రతిపాదించారు. శంషాబాద్, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల మీదుగా భారత్ ఫ్యూచర్‌సిటీ వరకు కారిడార్‌ను నిర్మిస్తున్నారు. దీంతో 14 గ్రామాలకు ప్రయోజనం లభించనుంది. అలాగే ఓఆర్‌ఆర్ పెద్ద అంబర్‌పేట్ జంక్షన్ నుంచి మేడ్చల్ జంక్షన్ వరకు ఉన్న 14 గ్రామాలకు, మేడ్చల్ జంక్షన్ నుంచి పటాన్‌చెరు వరకు 10 గ్రామాలు, పటాన్‌చెరు జంక్షన్ నుంచి నార్సింగి జంక్షన్ వరకు 12 గ్రామాలకు ప్రయోజనం చేకూరనుంది. ఔటర్ నార్సింగి జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఔటర్ మెట్రోను విస్తరిస్తే మరో ఆరు గ్రామాలకు మెరుగైన రవాణా అందనుంది.
ఓఆర్ఆర్ మెట్రోకు గతంలో ప్రతిపాదనలు
ఓఆర్ ఆర్ శంషాబాద్ -పెద్ద అంబర్‌పేట్: 5 స్టేషన్లు
ఓఆర్ ఆర్ పెద్ద అంబర్పేట్ - మేడ్చల్: 5 స్టేషన్లు
ఓఆర్ఆర్ మేడ్చల్ - పటాన్ చెరు : 3 స్టేషన్లు
ఓఆర్ ఆర్ పటాన్‌చెరు - నార్సింగ్ : 3 స్టేషన్లు
మరో 22 కిలోమీటర్లు పొడిగిస్తే..
బీఆర్ఎస్ ప్రభుత్వం కిలోమీటర్ దూరానికి మరో 22 కిలోమీటరలను జోడించి నార్సింగి జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు ఔటర్ మెట్రోను విస్తరిస్తే 158 కిలోమీటర్ల మేర వలయాకారంలో మెట్రో తిరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వలయాకారం నుంచి నగరంలోకి ఇంటర్ కనెక్టివిటీని కూడా మెరుగు పరిస్తేనే సులువైన మెట్రో ప్రయాణం అందుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఓఆర్ఆర్ బయటే పార్కింగ్..
ఔటర్ నుంచి వాహనాల ద్వారా వచ్చే వారు తమ వాహనాలను నగరంలోకి తీసుకురాకుండా ఉండేందుకు నలుదిక్కులా 5 నుంచి 10 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని గతంలో నిర్ణయించారు. ఔటర్ జంక్షన్ వద్ద మెట్రో రైలు ఎక్కిన ప్రయాణికులు కేవలం 20-25 నిమిషాల్లో నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకుని సాఫీగా పనులను చేసుకుని వెళ్లాలని, ఔటర్ చుట్టూ ఎండ్ టు ఎండ్ వరకు మెట్రోను నడిపిస్తే బాగుంటుందని ప్రణాళికలు రూపొందించినా కానీ అవి ఇప్పటికీ అడుగు ముందుకుపడని పరిస్థితి నెలకొందని అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భోజనం తర్వాత ఇలా చేస్తే.. ఈ ప్రయోజనాలు..?
CAT పరీక్ష.. అభ్యర్థులకు కీలక సూచన
Read Latest TG News and National News