Hyderabad: ఇలా చేస్తే అంతే అంటూ.. నగర జీవికి వార్నింగ్
ABN , Publish Date - Sep 14 , 2025 | 07:40 PM
జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్లపై చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. అందుకు సంబంధించిన ఆదేశాలు సైతం జారీ చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 14: హైదరాబాద్ నగర ప్రజలను పలు సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. వాటిలో ట్రాఫిక్, కాలుష్యం, వర్షం కురిస్తే రహదారులు భారీ చెరువులను తలపించే వంటి సమస్యలు ఉంటాయి. ఇవే కాకుండా చెత్త సమస్య సైతం నగర జీవులను ప్రధానంగా ఇబ్బంది పెడుతోంది. ఈ చెత్త సమస్య నగరంలోని గల్లీల్లోనే కాకుండా.. ప్రధాన ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లోని ప్రజలనూ కలవరపాటుకు గురి చేస్తోంది. ఇతర సమస్యల కన్నా ఈ సమస్య నగర జీవులను మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది.
అలాంటి వేళ నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్లపై చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. అందుకు సంబంధించిన ఆదేశాలు సైతం జారీ చేశారు. అందులో భాగంగా స్పెషల్ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా.. రోడ్లపై చెత్త వేస్తే చట్టంలోని సెక్షన్ల ప్రకారం.. 8 రోజులు జైలు శిక్ష పడడమే కాకుండా.. జరిమానా సైతం విధిస్తామంటూ హెచ్చరిస్తున్నారు.
మరోవైపు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటికే బోరబండ ప్రాంతంలో పోలీసులు గత రెండు రోజులుగా రోడ్లపై చెత్త వేసిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై చార్జీషిట్ దాఖలు చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. దీంతో న్యాయమూర్తి వారికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు. ఈ అంశం నగర ప్రజలకు ఒక హెచ్చరికని అధికారులు స్పష్టం చేశారు. ఇక రోడ్డుపై చెత్త వేసే వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని అంటున్నారు.
అదీకాక.. రోడ్లపై, నాలాల్లో చెత్త వేయడం వల్ల పర్యావరణ సమస్యలే కాదు.. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వర్షాకాలం కూడా కావడంతో ఎక్కడికక్కడ మురుగు నీరు నిలిచిపోయి దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో డెంగ్యూ, చికెన్ గున్యా తదితర అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. దాంతో ప్రజలు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. దీంతో ప్రభుత్వం సమర్థతపై ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి.
ప్రజారోగ్యానికి ప్రభుత్వం తిలోదకాలు వదిలిందని.. ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. నగరవాసులు సైతం ఈ సమస్యపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి వేళ.. రోడ్లపై చెత్త వేస్తే జరిమానాతోపాటు జైలు శిక్ష సైతం విధిస్తామంటున్నారు. అయితే భవిషత్తులో ఈ జరిమానాను మరింత పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మొదటిసారి పట్టుబడితే వారికి జరిమానా విధించడం.. అదే రెండోసారి తప్పు చేస్తే.. జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హనీ ట్రాప్‌లో చిక్కుకున్న యోగా గురువు.. పోలీసుల ఎదుట లబోదిబో..
తురకపాలెంలోని పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన
For More AP News And Telugu news