High Court on DSC recruitment 2024: డీఎస్సీ అక్రమాలపై హైకోర్టులో విచారణ
ABN , Publish Date - Sep 17 , 2025 | 03:34 PM
స్పోర్ట్స్ అథారిటీ అవసరమైన రీవెరిఫికేషన్ లిస్టులు ఇవ్వకపోవడం వల్లే ఈ ఆలస్యం జరిగిందని హైకోర్టుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల రీవెరిఫికేషన్ లిస్టును ఇవ్వాలని పలుమార్లు స్పోర్ట్స్ అథారిటీకి లేఖలు రాసినట్లు ఆయన ఆధారాలను సమర్పించారు.
హైదరాబాద్: డీఎస్సీ- 2024 (District Selection Committee) టీచర్ నియామకాల్లో SGT స్పోర్ట్స్ కోటా (Secondary Grade Teacher)లో జరిగిన అక్రమాలపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. స్పోర్ట్స్ కోటా కింద జరిగిన నియామకాల్లో నిబంధనల ఉల్లంఘన, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు.
రీక్రూట్‌మెంట్‌పై రీవెరిఫికేషన్ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ, రీ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయకుండా అర్హులైన అభ్యర్థులను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ ఆలస్యం కావడానికి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు బాధ్యత వహించాల్సిందిగా పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు.
అయితే, ప్రభుత్వ తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. స్పోర్ట్స్ అథారిటీ అవసరమైన రీవెరిఫికేషన్ లిస్టులు ఇవ్వకపోవడం వల్లే ఈ ఆలస్యం జరిగిందని వివరించారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల రీవెరిఫికేషన్ లిస్టును ఇవ్వాలని పలుమార్లు స్పోర్ట్స్ అథారిటీకి లేఖలు రాసినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ తరఫు న్యాయవాది కోర్టులో ఆధారాలను సమర్పించారు. అవసరమైన లిస్టు రాకుండా ఈ ప్రక్రియను కొనసాగించలేమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
స్పోర్ట్స్ అథారిటీపై కోర్టు ఆగ్రహం
ఈ కేసులో స్పోర్ట్స్ అథారిటీ అధికారులే బాధ్యులని పేర్కొంటూ, హైకోర్టు వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతున్న కారణంగా అర్హత ఉన్న అభ్యర్థులు నష్టపోతున్నారని కోర్టు అభిప్రాయపడింది. వాదనలు విన్న న్యాయమూర్తి కేసు తదుపరి విచారణను అక్టోబర్ 15, 2025కి వాయిదా వేశారు.
Also Read:
గ్యాంగ్‌స్టర్ చోటారాజన్ బెయిలు రద్దు.. సుప్రీం సంచలన తీర్పు
ఎస్బీఐ బ్యాంకుకు పిస్టళ్లతో వచ్చి రూ.21 కోట్లతో ఎస్కేప్
For More Latest News