Share News

Karnataka Bank Heist: ఎస్బీఐ బ్యాంకుకు పిస్టళ్లతో వచ్చి రూ.21 కోట్లతో ఎస్కేప్

ABN , Publish Date - Sep 17 , 2025 | 01:57 PM

సినిమాల్లో బ్యాంకుల్లోకి వెళ్లి అక్కడి సిబ్బందికి తుపాకీ అడ్డు పెట్టి దోపిడీలు చేయడం చూస్తుంటాం. ఇప్పుడు అచ్చం అలాంటి ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లాలో జరిగింది.

Karnataka Bank Heist: ఎస్బీఐ బ్యాంకుకు పిస్టళ్లతో వచ్చి రూ.21 కోట్లతో ఎస్కేప్
Karnataka Bank Heist

సినిమాల్లో చూసినట్టు బ్యాంకులోకి ప్రవేశించి, తుపాకీతో సిబ్బందిని బెదిరించి నోట్లను ఎత్తుకెళ్లే దృశ్యాలు చూసి కేవలం సినిమాలోనే జరుగుతుందులే అనుకుంటాం. కానీ అలాంటి ఘటన నిజంగా కర్ణాటకలోని విజయపుర జిల్లాలో జరిగింది (Karnataka Bank Heist). ఒక బ్యాంక్‌లో దోపిడీదారులు ఏకంగా తుపాకీతో వచ్చి, చుట్టుపక్కలున్నవారిని భయబ్రాంతులకు గురిచేసి, సెకన్ల వ్యవధిలో కోట్ల రూపాయలు ఎత్తుకెళ్లారు. ఇది కేవలం స్క్రీన్‌పైనే కాదు, నిజంగా చోటుచేసుకుంది.


కర్ణాటక విజయపుర జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంకులో ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్ 16న మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు విజయపుర జిల్లాలోని చద్చన్ టౌన్‌లో ఉన్న SBI బ్రాంచ్‌లోకి ముగ్గురు మాస్క్‌లు ధరించిన వ్యక్తులు వచ్చారు. వాళ్లు మిలిటరీ యూనిఫామ్‌లో ఉన్నారు. చేతిలో దేశీ తుపాకులు, కత్తులు ఉన్నాయి. వాళ్లు బ్యాంకులోకి వచ్చినప్పుడు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పి స్టాఫ్‌ను కన్ఫ్యూజ్ చేశారు.


ఆ తర్వాత అక్కడ ఉన్న బ్యాంక్ మేనేజర్, క్యాషియర్, ఇతర సిబ్బందిని కత్తులు, తుపాకులతో బెదిరించి, వాళ్ల చేతులు, కాళ్లు కట్టేశారు. అంతటితో ఆగలేదు. వారిని బాత్‌రూమ్‌లో బంధించి నగదు, బంగారం తీసి ఇవ్వండి, లేకపోతే చంపేస్తామని బెదిరించారు. చివరికి, దాదాపు రూ.1 కోటి నగదు, 20 కిలోల బంగారం దోచుకుని, సుజుకి EVA వాహనంలో మహారాష్ట్రలోని పండరిపూర్ వైపు పరారయ్యారు.


ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు బ్యాంకుకు చేరుకున్నారు. దొంగలను పట్టుకోవడానికి పూర్తి స్థాయిలో ఆపరేషన్ మొదలుపెట్టామని విజయపుర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లక్ష్మణ్ తెలిపారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నామన్నారు. దీనిపై బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 17 , 2025 | 01:59 PM