Chhota Rajan: గ్యాంగ్‌స్టర్ చోటారాజన్ బెయిలు రద్దు.. సుప్రీం సంచలన తీర్పు
ABN , Publish Date - Sep 17 , 2025 | 02:56 PM
హోటల్ వ్యాపారి జయశెట్టి హత్యకు సంబంధించిన కేసులో గత ఏడాది మేలో ప్రత్యేక కోర్టు చోటా రాజన్‌ను దోషిగా నిర్ధారించింది. జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును ముంబై హైకోర్టులో చోటారాజన్ సవాలు చేశారు.
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ చోటారాజన్ (Chhota Rajan)కు 2001 జయశెట్టి హత్య కేసులో ముంబై హైకోర్టు ఇచ్చిన బెయిలును సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారంనాడు రద్దు చేస్తూ కీలక తీర్పు చెప్పింది. హోటల్ వ్యాపారి జయశెట్టి హత్యకు సంబంధించిన కేసులో గత ఏడాది మేలో ప్రత్యేక కోర్టు చోటా రాజన్‌ను దోషిగా నిర్ధారించింది. జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును ముంబై హైకోర్టులో చోటారాజన్ సవాలు చేశారు. 2024 అక్టోబర్ 23న ముంబై హైకోర్టు చోటారాజన్ విధించిన శిక్షను సస్పెండ్ చేస్తూ బెయిలు మంజూరు చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని సీబీఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన డివిజన్ బెంచ్ దీనిపై విచారణ జరిపింది. 'చోటారాజన్ నాలుగు కేసుల్లో దోషిగా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తికి విధించిన జైలుశిక్షను ఏ విధంగా రద్దు చేస్తారు?' అని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వును రద్దు చేసింది.
డిఫెన్స్ వాదనలను తోసిపుచ్చిన సుప్రీం
చోటారాజన్‌పై ఉన్న 71 కేసుల్లో 47 కేసుల్లో సీబీఐ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవని రాజన్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఆయన వాదనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇతర కేసుల్లో ఇప్పటికే జీవిత ఖైదు పడినందున తిరిగి అతను లొంగిపోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.
హత్యకు ముందు బెదిరింపులు
ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం, దక్షిణ ముంబైలోని గోల్డెన్ క్రౌన్ హోటల్ యజమాని జయశెట్టికి చోటారాజన్ ముఠా నుంచి బలవంతపు వసూళ్ల బెదిరింపులు వచ్చాయి. శెట్టికి పోలీసు రక్షణ కల్పించినప్పటికీ అతని హత్యకు రెండు నెలల ముందు భద్రతను ఉపసంహరించారు. రూ.50,000 ఇవ్వాలన్న చోటారాజన్ గ్యాంగ్ డిమాండ్‌ను కాదన్నందుకు 2001 మే 4న జయశెట్టిని అతని కార్యాలయం వెలుపల ఇద్దరు ముఠా సభ్యులు కాల్చిచంపారు. 2024 మేలో ముంబైలోని ప్రత్యేక ఎంసీఓసీఏ కోర్టు చోటారాజన్‌కు జీవిత ఖైదు, రూ.1,00,000 జరిమానా విధించింది.
ఇవి కూడా చదవండి..
అణు బెదిరింపులకు భారత్ భయపడదు: ప్రధాని మోదీ
ప్రారంభమైన వైష్ణో దేవి యాత్ర.. భక్తులకు కీలక సూచన
Read Latest National News and Telugu News