Vaishno Devi Yatra Resumes: ప్రారంభమైన వైష్ణో దేవి యాత్ర.. భక్తులకు కీలక సూచన
ABN , Publish Date - Sep 17 , 2025 | 09:27 AM
మాతా వైష్ణో దేవి యాత్ర బుధవారం తిరిగి ప్రారంభమైంది. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
శ్రీనగర్, సెప్టెంబర్ 17: భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపోవడంతో నిలిచిపోయిన వైష్ణో దేవి యాత్రను పునరుద్ధరించారు. 22 రోజులుగా నిలిచిపోయిన ఈ యాత్ర బుధవారం తిరిగి ప్రారంభమైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో.. బుధవారం నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లు శ్రీ మాతా వైష్ణో దేవి బోర్డు మంగళవారం ట్విట్ చేసింది. ఈ యాత్ర తిరిగి ప్రారంభం కావడంతో.. బుధవారం తెల్లవారుజామున బన్‌గంగా దర్శన్ గేట్ వద్దకు వందలాది మంది భక్తులు చేరుకున్నారు. ఈ యాత్రను తిరిగి ప్రారంభించడంతో.. అమ్మవారి భక్తుల్లో ఆనందం వెల్లువిరిసింది. వైష్ణో దేవి అమ్మవారిని దర్శించుకునేందుకు ఉన్న రెండు మార్గాలను బుధవారం ఉదయం 6.00 గంటలకు తెరిచారు.
ఈ యాత్రలో పాల్గొనే భక్తులకు శ్రీ మాతా వైష్ణో దేవి బోర్డు కీలక సూచనలు చేసింది. భక్తులు ఏదైనా గుర్తింపు కార్డును తప్పని సరిగా తమ వద్ద ఉంచుకోవాలని సూచించింది. అలాగే యాత్రా మార్గంలో.. దేవాలయం వద్ద సిబ్బందికి సహకరించాలని కోరింది. ఈ యాత్రలో పాల్గొనే భక్తుల రక్షణ కోసం అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించింది. ఇక రానున్న రోజుల్లో మరింత మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారని పేర్కొంది.
మరి ముఖ్యంగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శరన్నవరాత్రులు.. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో వస్తారని శ్రీ మాతా వైష్ణో దేవి బోర్డు అంచనా వేస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల మెరుపు వరదల వెల్లువెత్తాయి. అలాగే భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో 34 మంది భక్తులు మరణించారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శ్రీ మాతా వైష్ణో దేవి బోర్డు ప్రకటించింది. 22 రోజుల అనంతరం ఈ యాత్రను తిరిగి ప్రారంభమైంది.