HYD Rain Alert: దంచికొడుతున్నవర్షాలు.. హైదరాబాద్ అస్తవ్యస్తం..
ABN , Publish Date - Aug 19 , 2025 | 07:11 AM
భారీ వర్షాల దాటికి హైదరాబాద్ నగరం అస్తవ్యస్తం అవుతుంది. నిన్న రాత్రి కురుసిన వర్షానికి నగరమంతా జలమయం అయిపోయింది. రోడ్లు చెరువులను తలిపిస్తున్నాయి
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రాత్రి, పగలు అని తేడా లేకుండా.. వరుణుడు కుంభవర్షం కురిపిస్తున్నాడు. ఈ మేరకు పలు జిల్లాలకు వాతవారణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. వర్షాల దృష్ట్యా అధికారులు పలు జిల్లాల్లోని స్కూళ్లకు సెలువులు సైతం ప్రకటించారు. చాలా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వరద ముప్పు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
అయితే.. భారీ వర్షాల దాటికి హైదరాబాద్ నగరం అస్తవ్యస్తం అవుతోంది. నిన్న(సోమవారం) రాత్రి కురుసిన వర్షానికి నగరమంతా జలమయం అయిపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో మునిగిపోయాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనసంచారం స్థంబించిపోయింది. పలు కాలనీలు పూర్తిగా జలమయం అవ్వడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నాలాలు పొంగిపొర్లుతున్నాయి. డ్రైనేజీ నీరు రోడ్లపై వరదలా ప్రవహిస్తోంది. వర్షాల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఈ వర్షాలు ఇంకా మూడ్రోజులపాటు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. దూరం ప్రయాణం చేసే వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే.. జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నగరంలో నిలిచిపోయిన నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా.. భద్రాద్రి, మహబూబాబాద్ , ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్జ్ జారీ చేసింది. అన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు(గాలి వేగం గంటకు 30-40 కి.మీ వేగంతో)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవీ చదవండి:
రాబోయే జీఎస్టీ సంస్కరణలు ఇవేనా.. ప్రజలకు ఇక పండగే
భారతీయ కరెన్సీలో చెల్లింపుల దిశగా ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం