HCA Scam: హెచ్‌సీఏ స్కామ్‌లో మరొకరు అరెస్ట్
ABN , Publish Date - Jul 25 , 2025 | 09:16 PM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో శుక్రవారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సంస్ధ జనరల్ సెక్రటరీ దేవరాజ్‌ను సీఐడీ అరెస్ట్ చేసింది. అలాగే ఈ ఏడాది సమ్మర్ క్యాంపులు నిర్వహించినట్లు లెక్కలు చూపించి.. ఈ సంస్థ రూ. 4 కోట్లు స్వాహా చేసింది. ఈ విషయాన్ని సీఐడీ గుర్తించింది.
హైదరాబాద్, జులై 25: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దేవరాజ్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మహారాష్ట్రలోని పుణెలో దేవరాజును అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని హైదరాబాద్ తీసుకువచ్చి.. మల్కాజ్‌గిరి కోర్టులో హాజరుపరిచారు. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై కేసు నమోదైన.. దాదాపు 17 రోజుల అనంతరం సీఐడీ పోలీసులకు దేవరాజు చిక్కారు. ఈ 17 రోజుల్లో దాదాపు 7 రాష్ట్రాల్లో దేవరాజు పర్యటించినట్లు ఈ సందర్భంగా పోలీసులు గుర్తించారు.
అయితే దేవరాజును గాలించేందుకు 6 ప్రత్యేక బృందాలను సీఐడీ అధికారులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో కుంభకోణం వెలుగులోకి రాగానే.. ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ సమాచారంతో సీఐడీ నుంచి దేవరాజు తప్పించుకున్న విషయం విదితమే. దీంతో ఆయనను పట్టుకునేందుకు సీఐడీ బృందాలు.. ఈ 17 రోజుల్లో 7 రాష్ట్రాలు తిరిగాయి. చివరకు పుణెలో దేవరాజును అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ అధికారులు దాదాపు 36 గంటల పాటు నిర్విరామంగా పని చేసి.. పుణెలో దేవరాజును అరెస్ట్ చేశారు.
సీఐడీ నుంచి దేవరాజు తప్పించుకున్న తర్వాత.. హైదరాబాద్, భద్రాచలం, కాకినాడ, వైజాగ్, తిరుపతి, నెల్లూరు, చెన్నై, కాంచీపురం, బెంగళూరు, గోవా, పుణె, ఊటీ, యానాం తదితర ప్రదేశాల్లో దేవరాజు పర్యటించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో సీఐడీ అధికారులు దేవరాజును పట్టుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కుంభకోణంలో దేవరాజు ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే.
ఇంతకీ ఏం జరిగిందంటే..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో భారీగా అవకతవకలు జరిగినట్లు సీఐడీ పోలీసులు గుర్తించారు. అందులోభాగంగా హెచ్‌సీఐ అధ్యక్షుడితోపాటు మరో ఐదుగురిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో వారిని అరెస్ట్ చేశారు. అయితే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయనున్నారంటూ హెచ్‌సీఏ ప్రధాన కార్యదర్శి దేవరాజ్‌కు ముందుస్తుగా ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి సమాచారం అందించారు. దీంతో దేవరాజ్ పరారయ్యారు. దీంతో ఐదుగురిని మాత్రమే సీఐడీ అరెస్ట్ చేసింది. దేవరాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు.. దేవరాజ్ పరారయ్యేందుకు సహకరించిన ఉప్పల్ సీఐపై పోలీస్ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
ఇవి కూడా చదవండి..
శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన..
సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే జాలేస్తుంది: కేటీఆర్
For Telangana News And Telugu News