Share News

BRS Working President: సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే జాలేస్తుంది: కేటీఆర్

ABN , Publish Date - Jul 25 , 2025 | 08:38 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్య బాణాలు సంధించారు. సీఎం రేవంత్ డిగ్రీ సర్టిఫికేట్ నకిలీది అయి ఉంటుందన్నారు.

BRS Working President: సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే జాలేస్తుంది: కేటీఆర్
BRS Working President KTR

హైదరాబాద్, జులై 25: బీసీ రిజర్వేషన్ అంశంతోపాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ లేఖ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన తీరుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ వ్యంగ్య బాణాలు సంధించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి కేటీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ.. సోనియాగాంధీ రాసిన లేఖలో ఏముందో సీఎం రేవంత్ రెడ్డికి తెలియదన్నారు. కనీసం లేఖ చదివే తెలివి సైతం ఆయనకు లేదంటూ సీఎం రేవంత్‌ రెడ్డిపై మండిపడ్డారు.


సీఎం రేవంత్ రెడ్డి తనకుందంటున్న డిగ్రీ సర్టిఫికేట్.. దొంగ డిగ్రీనేమో అంటూ ఈ సందర్భంగా కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ రాసిన లేఖలో ఏముందో తెలియకుండానే సీఎం రేవంత్ మురిసిపోయాడంటూ ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ తనను మెచ్చుకుంటూ ఉత్తరం రాశారని చెబుతున్నాడన్నారు. కానీ చదువు రాక సీఎం రేవంత్ రెడ్డి పరవశించి పోతున్నాడని చెప్పారు.


అయితే రేవంత్ రెడ్డి కార్యక్రమానికి రాలేక పోతున్నానని మాత్రమే సోనియా గాంధీ రాసిన లేఖలో స్పష్టం చేశారని కేటీఆర్ వివరించారు. అంతేకానీ.. సదరు లేఖలో ఒక్క మాట కూడా ప్రశంస లేదని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాలేనన్న సోనియా గాంధీ మాటలే తనకు ఆస్కార్, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులంటూ సీఎం రేవంత్ చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే జాలేస్తుందన్నారు.


తెలంగాణలో కుల గణన అంశంపై జులై 24వ తేదీ అంటే.. గురువారం న్యూఢిల్లీలోని ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరా భవన్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ, లోక్ సభ ఎంపీలతోపాటు ఆ పార్టీ అగ్రనేతలంతా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఆ పార్టీ అగ్రనేత, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ హాజరు కాలేదు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ ప్రత్యేకంగా లేఖ రాశారు. తనకు పార్టీ అగ్రనేత సోనియాగాంధీ స్వయంగా లేఖ రాయడంపై సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ లేఖ తనకు నోబెల్ అవార్డుతో సమానమన్నారు. అలాగే ఈ లేఖ ఆస్కార్ అవార్డుగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ పైవిధంగా స్పందించారు.

ఇవి కూడా చదవండి..

శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన..

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై వైఎస్ షర్మిల విమర్శలు

For Telangana News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 08:56 PM