Telangana Water Row: బనకచర్ల వివాదం.. రేవంత్‌కు హరీష్ సూటి ప్రశ్న
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:57 PM
దేశంలోని ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నీతి ఉంటుందా అని హరీష్ రావు నిలదీశారు. అత్యంత ముఖ్యమైన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
హైదరాబాద్, అక్టోబర్ 11: బనకచర్లపై కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ లేఖపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించాలని మాజీమంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ చెప్పినవన్నీ నిజమవుతున్నాయన్నారు. కమీషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి బనకచర్లకు సహకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా.. డీపీఆర్ ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు.
దేశంలోని ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నీతి ఉంటుందా అని నిలదీశారు. అత్యంత ముఖ్యమైన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళాలని డిమాండ్ చేశారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు వెళ్ళొద్దని చెప్పినా.. సీఎం రేవంత్ వెళ్ళటం వెనుక ఆంతర్యమేంటి అని నిలదీశారు. కేంద్రమంత్రి రాసిన లేఖ అబద్ధమా? కర్ణాటక, మహారాష్ట్ర లేఖలు అబద్ధమా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నల్లమల పులినా? నల్లమల పిల్లినా ? అంటూ ఎద్దేవా చేశారు. ఖర్గే కోసం కర్ణాటక పోయిన రేవంత్.. ఆల్మట్టి ఎత్తుపై ఎందుకు మాట్లాడలేదని మరో ప్రశ్న సంధించారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కులు కాపాడాలంటే బీఆర్ఎస్‌ను కాపాడుకోవాలన్నారు. కేసీఆర్ మాత్రమే తెలంగాణ హక్కులను కాపాడుతారని వెల్లడించారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తేనే.. తెలంగాణకు ప్రయోజనాలు కాపాడుతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాణం ఏపీ ఎంపీల చేతులో ఉందన్నారు. బీఆర్ఎస్‌కు ఎంపీలు ఉండి ఉంటే తెలంగాణ హక్కులపై పార్లమెంట్‌లో కోట్లాడేవారని అన్నారు. ప్రాంతీయ పార్టీల ఎంపీలు ఉంటేనే రాష్ట్రాలకు న్యాయం అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కేటీఆర్ టెలికాన్ఫరెన్స్.. జూబ్లీహిల్స్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్
నిండు ప్రాణం తీసిన వేడి టీ.. టీ తాగిన రెండు రోజులకు..
Read Latest Telangana News And Telugu News