GHMC: హైదరాబాద్‌లో మాంసం దుకాణాలపై కొరడా
ABN , Publish Date - Feb 09 , 2025 | 11:50 AM
GHMC: ఆదివారం వస్తే లొట్టలేసుకుని తినే కోడి, మేక మాంసంలో కల్తీ జరుగుతోంది. చచ్చిన కోళ్లు, కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తూ కొంతమంది వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న మాంసం దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్: ఆదివారం వస్తే ముక్కలేనిదే ముద్ద దిగదు. మాంసాహారులకు ఇష్టమైన చికెన్, మటన్లను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో కొంతమంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా చెలగాటమాడుతున్నారు. ఇలాంటి వారి షాపులపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిబంధనలు పాటించని షాపులను అధికారులు సీజ్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లైసెన్స్ లేకుండా మాంసం దుకాణాలు నిర్వహిస్తున్న వాటిని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల బృందం ఆదివారం మూసి వేయించారు.
జంటనగరాల్లో ఎక్కువ మంది మాంసం విక్రేతలు అధిక ధరలు వసూలు చేయడం, నాణ్యతగా లేని మాంసాన్ని అమ్ముతూ కొనుగోలు దారులను దోచుకుంటున్నారని ఫిర్యాదులు వస్తుండటంతో జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లో కల్తీ మాంసం విక్రయాలపై బల్దియా దృష్టి పెట్టింది. రూల్స్ పాటించని నాన్ వెజ్ దుకాణాలపై జీహెచ్ఎంసీ సీరియస్ అయింది. 5,730 చికెన్, మటన్, ఫిష్, బీఫ్ షాపులకు బల్దియా నోటీసులు జారీ చేసింది.
అనధికారికంగా 30 వేలకు పైగా మాంసం దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్సులు లేకుండానే చికెన్, మటన్ షాపులను నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. అపరిశుభ్రత మధ్య నాన్ వెజ్ షాపులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మాంసం కుళ్లి రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్, మటన్ విక్రయిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. జీహెచ్ఎంసీ స్టాంపు లేని మటన్‌ను ప్రజలకు విక్రయిస్తున్నారని అన్నారు. నోటీసులు ఇచ్చిన పద్ధతి మార్చుకోకపోతే మాంసం దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది.