KTR: కాంగ్రెస్ ఓ చెత్త సర్కార్.. కేటీఆర్ ఘాటు విమర్శలు
ABN , Publish Date - Aug 18 , 2025 | 11:42 AM
కాంగ్రెస్ సర్కార్ పనితీరుతో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే సీజనల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై మున్సిపల్ శాఖ, జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు సమన్వయ సమావేశాలు నిర్వహించి, ముందస్తు చర్యలు చేపట్టేవని ఆయన గుర్తు చేశారు.
హైదరాబాద్: రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్తకుప్పలతో రాష్ట్రంలోని హైదరాబాద్ నగరం, ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ఓ చెత్త సర్కారని ఘాటుగా విమర్శించారు. ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ పనితీరుతో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే సీజనల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై మున్సిపల్ శాఖ, జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు సమన్వయ సమావేశాలు నిర్వహించి, ముందస్తు చర్యలు చేపట్టేవని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలు ఈసురోమని అలమటిస్తుంటే.. పాలకులు మాత్రం ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లలో బిజీగా ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి విధానాలతో ప్రజలు అల్లడిపోతున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రసంగం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు లేకుండా ఆ ప్రసంగాన్ని పూర్తి చేయరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో భవిష్యత్తులో రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారని చెప్పుకొచ్చారు. రానున్న స్థానిక ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ తన పట్టు సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
డ్రమ్ములో పురుషుడి కుళ్లిన శవం.. ఫ్యామిలీ మిస్సింగ్..
చివరి నిమిషంలో విమానం రద్దు.. కారణం ఏంటంటే..