Hyderabad News: నగరంలో మరో విషాదం.. రథం లాగుతూ 5 మంది మృతి
ABN , Publish Date - Aug 18 , 2025 | 06:46 AM
ఊరేగింపు ముగించుకుని 9 మంది లోపలకి రథంను తోసుకుంటూ వెళ్తున్న సమయంలో రథంకు విద్యుత్ తీగలు తాకడంతో విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 5 మంది మృతి చెందాగా.. మరో 4 గురి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ గోఖలే నగర్‌లో యాదవ్ సంఘం ఫంక్షన్ హాల్ వద్ద శ్రీ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా శ్రీకృష్ణుడు విగ్రహం కలిగిన రథం బండి ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు ముగించుకుని 9 మంది సభ్యులు రథంను లోపలకి తోసుకుంటూ వెళ్తున్న సమయంలో రథంకు విద్యుత్ తీగలు తాకడంతో విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 5 మంది మృతి చెందాగా.. మరో 4 గురి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిలో కృష్ణ యాదవ్( 24), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ యాదవ్(34), రుద్ర వికాస్ (39), రాజేంద్ర రెడ్డి(39)లు ఉన్నారు. ఈ ఘటనతో నగరమంత ఒకసారిగా ఉలిక్కిపడింది. ఊరేగింపులో విషాదకర ఘటన చోటుచేసుకోవడంతో.. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా.. విలపిస్తున్నారు.
పోలీసులు ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు. అనంతరం సంఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి ఆరా తీశారు. అయితే గాయపడిన వారిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గన్‌మెన్ శ్రీనివాస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరుఫున పరిహారం అందించేందుకు ప్రయత్నం చేస్తామని అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ