CP Sajjanar Warning: మైనర్లతో వీడియోలపై హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Oct 16 , 2025 | 01:12 PM
అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని సీపీ ప్రశ్నలు సంధించారు. తక్షణమే వీడియోలు డిలీట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 16: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, పలు యూట్యూబ్ నిర్వాహకులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) వార్నింగ్ ఇచ్చారు. వ్యూస్ కోసం మైనర్లతో వీడియోలు తీయడంపై సీపీ ఫైర్ అయ్యారు. వైరల్ హబ్ యూట్యూబ్ ఛానల్‌లో మైనర్స్ ఇంటర్వ్యూని ఉద్దేశిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సజ్జనార్. వ్యూస్ మాయలో పడి విలువలు మర్చిపోతే ఎలా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించిన హైదరాబాద్ సీపీ... సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్తును నాశనం చెయ్యొద్దంటూ హెచ్చరిక జారీ చేశారు.
అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నలు సంధించారు. తక్షణమే వీడియోలు డిలీట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అప్లోడ్ చేసిన వీడియోలు డిలీట్ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి వీడియోలు చేస్తే ఫోక్సో, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలను ఉల్లంఘించడమేనని అన్నారు. చిన్నారులతో సమాజానికి స్ఫూర్తినిచ్చే వీడియోలు చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో చిన్న పిల్లల అసభ్య వీడియోలు ఉంటే ఫిర్యాదు చేయాలని ప్రజలకు వినతి చేశారు. హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ గానీ, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలన్నారు. ‘తల్లిదండ్రులుగా మీ బాధ్యత పిల్లలను పెంచడం మాత్రమే కాదు.. వారి బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం అనే విషయాన్ని మరచిపోవద్దు. మీ పిల్లలను అనుచిత కంటెంట్ నుంచి దూరంగా ఉంచండి. వారికి సానుకూల వాతావరణం, సరైన విలువలు అందించండి’ అంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి...
నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే జరిగేది ఇదే: పీసీసీ చీఫ్
Read Latest Telangana News And Telugu News