CM Revanth Reddy: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు: సీఎం
ABN , Publish Date - Dec 18 , 2025 | 06:16 PM
మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
హైదరాబాద్, డిసెంబర్ 18: రాష్ట్రంలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత ఫలితాలు సాధించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపునకు కష్టపడిన పార్టీ కార్యకర్తలకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఈ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు సీఎం. గురువారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో పలువురు మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
రాష్ట్రంలో మొత్తం 12,702 పంచాయతీలకు గానూ 7,527 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు సీఎం. 808 కాంగ్రెస్ రెబల్స్ నెగ్గారని వివరించారు. దీంతో 66 శాతం ఫలితాలను కాంగ్రెస్ పార్టీ సాధించిందన్నారు. 3,511 బీఆర్ఎస్, 710 బీజేపీ మొత్తంగా 33 శాతం గెలిచాయని పేర్కొన్నారు. మా రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ ఫలితాలని ఆయన అభివర్ణించారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
94 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరగ్గా.. 87 స్థానాల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం కనబరిచారని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కూటమిగా పోటీ చేశాయని ఆరోపించారు.
బీఆర్ఎస్, బీజేపీ కూటమికి 33 శాతం విజయాలు మాత్రమే దక్కాయన్నారు. బీఆర్ఎస్‌కు 3,511 సర్పంచ్ స్థానాలు, బీజేపీ 710 చోట్ల గెలిచాయని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ కూటమికి 4,221 స్థానాలు మాత్రమే దక్కాయని సీఎం రేవంత్ తెలిపారు. ఇటీవల ప్రజాపాలన రెండేళ్ల సంబురాలు నిర్వహించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైఎస్ జగన్‌కు మంత్రి సత్యకుమార్ సవాల్
విద్యార్థుల మృతి కేసులో నకిలీ పోలీసుల విచారణ.. వెలుగులోకి సంచలన విషయాలు
For More TG News And Telugu News