Share News

Satyakumar Slams Jagan: వైఎస్ జగన్‌కు మంత్రి సత్యకుమార్ సవాల్

ABN , Publish Date - Dec 18 , 2025 | 07:04 PM

పిపిపి మోడ్‌లో ప్రభుత్వాసుపత్రులు రావడం వల్ల పేద విద్యార్ధులకు సీట్లు వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. పిపిపి మోడ్‌ను ప్రైవేటైజేషన్ అంటూ ఆయన పార్టీ సేకరిస్తున్నవి కోటి సంతకాలు కావని.. అవి కోడి గీతలంటూ ఎద్దేవా చేశారు.

Satyakumar Slams Jagan: వైఎస్ జగన్‌కు మంత్రి సత్యకుమార్ సవాల్
Minister Satyakumar

అమరావతి, డిసెంబర్ 18: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ నిప్పులు చెరిగారు. ఈ రాష్ట్రంలో ఒక విజిటింగ్ పోలిటీషియన్ అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్నారని విమర్శించారు. కావాలని బలప్రదర్శనలు చేయడం ఆయనకు రివాజుగా మారిందన్నారు. ఈ రోజు గవర్నర్‌ని కలిసి కోటి సంతకాల సేకరణ అంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ జగన్‌పై మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ఈ రోజు అన్ని పరిధిలు దాటి చింత చచ్చినా పులుపు చావలేదన్న విధంగా ఆయన వ్యవహరించారని విమర్శించారు.


జగన్‌కు సవాల్..

మెడికల్ కాలేజిలో ఎవరైనా కన్‌స్ట్రక్షన్‌కు తీసుకుంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జైలుకు పంపుతాననడం అత్యంత హేయమైన వ్యాఖ్యలుగా ఆయన అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమన్నారు. మీకు ధైర్యం ఉంటే ఈ శాఖను నిర్వహిస్తున్న తనను జైలుకు పంపాలని మాజీ సీఎం జగన్‌కు మంత్రి సత్యకుమార్ సవాల్ విసిరారు. ఈ విషయంలో ధైర్యం ఉంటే సీబీఐ విచారణ కోరండని సూచించారు. మీకు ధైర్యం ఉంటే తనను న్యాయస్థానాలు ద్వారా జైలుకు పంపాలని మాజీ సీఎం జగన్‌కు స్పష్టం చేశారు.


బెదిరించడం సరికాదు..

వైద్య కళాశాలల నిర్మాణం కోసం ముందుకు వస్తున్న సంస్థలను బెదిరించడం సరికాదని వైఎస్ జగన్‌కు ఆయన హితవు పలికారు. 30 కేసులకుపైగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి .. ఒక జైలు జీవి ఇలాంటి అసత్య ప్రచారం చేయడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. ఈ తరహా అహంకారపూరిత వ్యాఖ్యల వల్లే మిమ్మల్ని ఎన్నికల్లో ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఏమైనా లోపభూయిష్ట విధానం ఉంటే దాని గురించి మాట్లాడాలంటూ జగన్‌కు సూచించారు.


108 పరిస్థితి ఏమిటి..?

పిపిపి మోడల్‌లో ఇవ్వడం తప్పయితే.. మరి 108ను ఎలాంటి రూల్స్ పాటించకుండా అరబిందోకు పిపిపి మోడ్‌లో ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. వాటిని విస్మరించి వీటిని తప్పని చెప్పడం ఏమిటని వైఎస్ జగన్‌ను నిలదీశారు. గతంలో మీరు నడిపిన ఆరోగ్యశ్రీ, క్యాథలాబ్‌లను కూడా పిపిపి అంటారా? అని సందేహం వ్యక్తం చేశారు.


పేదల వైద్యం కోసం..

ఈ 18 నెల్లల్లో పేదల వైద్యం కోసం ఎన్టీఆర్ వైద్య సేవల పేరుతో రూ. 6 వేల కోట్లు ఖర్చు చేశారని వివరించారు. వైఎస్ జగన్ ఈ రకంగా మాట్లాడడం వాస్తవానికి దూరంగా ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పని చేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని పార్టీ అధిష్టానం రాజీనామా చేయించిందే కానీ.. మెడికల్ కాలేజీల అంశంలో కాదని ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ వివరించారు. స్కాలర్‌షిప్‌ల విషయంలోనూ పెద్ద స్కాం చేశారని.. తమ తప్పును కప్పిపుచ్చడానికి ఈ తప్పులు వెతుకుతున్నారన్నారు.


స్థాయి సంఘం సైతం..

420 పడకల ఆసుపత్రుల నిర్మాణానికి ఎక్కువ నిధులు కేటాయించారని.. వారు ప్రస్తుతం అవినీతి అని ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రులు మెడికల్ కాలేజిలకు రూ.125 కోట్లు ఖర్చు అవుతుందంటున్నారన్నారు. ఈ రోజు సైతం జగన్ చెప్పిందే చెబుతున్నారని తెలిపారు. స్థాయి సంఘం కూడా ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో పిపిపికి వెళ్లడం తప్పు లేదని స్పష్టం చేసిందని గుర్తు చేశారు.


100 మంది జగన్మోహన్ రెడ్డిలు వచ్చినా..

పిపిపి అనేది ఎన్డీఏ ప్రభుత్వ విధానం..100 మంది జగన్మోహన్ రెడ్డిలు కట్టగట్టుకుని వచ్చినా ఎవర్ని ఏం చేయలేరని స్పష్టం చేశారు. రూ. కోటి 40 లక్షల కుటుంబాలకు రూ. 25 లక్షల వరకూ వైద్యం అందాలని ఎన్డీఏ ప్రయత్నం చేస్తుందని వివరించారు. అందుకు కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. జగన్ ఈ పరిస్థితి నుంచి బయటకు రాకుంటే.. వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీకి ఇప్పుడు వచ్చినన్ని సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు.


తాటాకు చప్పుళ్లు..

జగన్ ఏదీ చేయడు తాటాకు చప్పుళ్లు చేస్తాడని వ్యంగ్యంగా అన్నారు. కాలేజిలు నిర్మాణం ఉండకూడదు.. విద్యార్ధులకు సీట్లు రాకూడదు... పేదలకు వైద్య అందకూడదనేది వైఎస్ జగన్ నినాదంలా ఉందంటూ ఎద్దేవా చేశారు. జగన్ మానసిక పరిస్ధితి చూస్తే.. ఆత్మనూన్యతా భావనలో ఆయన ఉన్నట్లు ఉన్నారన్నారు. ఇది ఒక రకమైన మానసిక స్థితి అని చెప్పారు. తొందరగా ట్రీట్‌మెంట్ చేయించుకోవాలని ఆయన సూచించారు.


పేదలకు సీట్లు..

పిపిపి మోడ్‌లో ప్రభుత్వాసుపత్రులు రావడం వల్ల పేద విద్యార్ధులకు సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పిపిపి మోడ్‌ను ప్రైవేటైజేషన్ అంటూ ఆయన సేకరిస్తున్నవి కోటి సంతకాలు కావని.. అవి కోడి గీతలంటూ ఎద్దేవా చేశారు. జగన్మోహన రెడ్డి పాలనలో ఐదు సంవత్సరాల్లో ఆయుష్‌ ప్రతిపాదనలు సైతం కేంద్రానికి పంప లేదని గుర్తు చేశారు. విశాఖపట్నం వేదికగా నిర్వహించిన యోగాకు రూ. 300 కోట్లు ఖర్చు కాలేదన్నారు. అది కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం అని.. అందుకు నిధులు కేంద్రం నుండి వచ్చాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ జిల్లాల్లో నేరాలు ఎందుకు అధికమయ్యాయి.. విశ్లేషించండి: సీఎం ఆదేశం

విద్యార్థుల మృతి కేసులో నకిలీ పోలీసుల విచారణ.. వెలుగులోకి సంచలన విషయాలు

For More AP News And Telugu News

Updated Date - Dec 18 , 2025 | 07:57 PM