Fake Police Gang: విద్యార్థుల మృతి కేసులో నకిలీ పోలీసుల విచారణ.. వెలుగులోకి సంచలన విషయాలు
ABN , Publish Date - Dec 18 , 2025 | 05:12 PM
విజ్ఞాన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థులు మృతికి కారణమైన నకిలీ పోలీస్ గ్యాంగ్‌ను పోలీసలు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
నరసరావుపేట, డిసెంబర్18: ఐదుగురు విద్యార్థుల మృతికి కారణమైన నకిలీ పోలీస్ గ్యాంగ్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఐదు రోజులుగా ఈ నకిలీ పోలీస్ గ్యాంగ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులతో ఉన్న సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారాన్ని పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే వీరితో సంబంధం కలిగి ఉన్న ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు వేసి విషయం విదితమే. గురువారం వీరిని కస్టడీ విచారణ కోసం నరసరావుపేట జైలు నుంచి చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న అధికారి కుమారుడు వెంకట నాయుడు. అతడు నకిలీ పోలీస్ ఇన్స్‌పెక్టర్ అవుతారం ఎత్తాడు. అతడితో పాటు కొందరు వ్యక్తులతో కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలను అపి.. డ్రైవర్, క్లీనర్‌ల నుంచి నగదు వసూల్ చేయడమే లక్ష్యంగా వారు పని చేస్తున్నారు. అయితే డిసెంబర్ 4వ తేదీన చిలకలూరిపేట జాతీయ రహదారిపై నాదెండ్ల మండలం గణపవరం వద్ద ట్రాక్టర్లతో వెళ్తున్న భారీ కంటైనర్‌కు కారు అడ్డంగా పెట్టి ఆపే ప్రయత్నం చేశారు.
ఈ కంటైనర్ డ్రైవర్ ఒక్కసారిగా సెడన్ బ్రేక్ వేయడంతో వాహనం నిలిచిపోయింది. అదే రహదారిపై అత్యధిక వేగంతో వస్తున్న కారు.. ఆ కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ కంటైనర్ కిందకు కారు వెళ్లిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. వీరంతా విజ్ఞాన్ యూనివర్సిటీలో ఇంజినీరిగ్ చదువుతున్నారు. అయ్యప్పమాలలో ఉన్న వీరు.. శబరిమల యాత్రకు వెళ్లేందుక స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడు చెప్పిన ఆధారాలతోపాటు సంఘటన స్థలంలోని సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా నకిలీ బ్రేక్ ఇన్స్‌పెక్టర్ అవతారంలో వాహనాలు ఆపుతున్న వారిని గుర్తించారు.
అనంతరం వారిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ఏఎస్ఐ కుమారుడు వెంకట నాయుడు కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అతడిపై ఈ రోజు మరో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వీరికి కొందరు పోలీసులు సహకరించారని విచారణలో వెల్లడైంది. వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ జిల్లాల్లో నేరాలు ఎందుకు అధికమయ్యాయి.. విశ్లేషించండి: సీఎం ఆదేశం
వైఎస్ జగన్‌కు మంత్రి సత్యకుమార్ సవాల్
For More AP News And Telugu News