The case of Nerella: కవిత ఆరోపణలతో.. తెరపైకి నేరెళ్ల కేసు..
ABN , Publish Date - Sep 04 , 2025 | 05:10 PM
మాజీ ఎమ్మెల్సీ కవిత నేరెళ్ల కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి నేరెళ్ల బాధితుల కేసు తెరపైకి వచ్చింది.
రాజన్నసిరిసిల్ల: నేరెళ్ల ఇసుక లారీల కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌రావుపై తంగలపల్లి పీఎస్‌లో నేరెళ్ల బాధితుల ఫిర్యాదు చేశారు. సంతోష్ రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నేరెళ్లలో దళిత కుటుంబాలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించడానికి సంతోష్ రావు కారణమని, కేటీఆర్‌కు చెడ్డ పేరు వచ్చేలా సంతోష్ రావు వ్యవహరించారని మాజీ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరక పోలీసులు కేసు నమోదు చేస్తారా..? లేదా..? అనేది చర్చనీయాంశంగా మారింది.
రాజన్నసిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక లారీలను తగలబెట్టారనే ఆరోపణలపై దళితులను, బీసీ యువకులను పోలీసులు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందే. ఇసుక లారీ ఢీకొని, ఓ వ్యక్తి మృతి చెందడంతో ఆగ్రహించిన స్థానికులు పలు ఇసుక లారీలను తగులబెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కొందరిని చిత్రహింసలకు గురిచేశారు. 2017లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘటన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..