Share News

CM Revanth Reddy: డేంజర్‌లో 16 జిల్లాలు.. రేపు వరంగల్‌కు సీఎం రేవంత్

ABN , Publish Date - Oct 30 , 2025 | 01:56 PM

అధికారులతో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు, కలెక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే.. కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధిత జిల్లా ఇంచార్జ్ మంత్రికి తెలపాలని పేర్కొన్నారు.

CM Revanth Reddy: డేంజర్‌లో 16 జిల్లాలు.. రేపు వరంగల్‌కు సీఎం రేవంత్
CM Revanth Reddy

హైదరాబాద్: మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని తెలిపారు. దీనిపై ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇది వరి కోతల కాలం.. కానీ అనుకోని ఉపద్రవం రైతులకు ఆవేదన మిగులుస్తోందన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అధికారుల అందరి సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశించారు. ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు.


రోడ్లపై బ్రిడ్జిలు, లోలెవల్ కాజ్‌వేల వద్ద వరద నీరు నిలిచినా, రోడ్లు దెబ్బతిన్నా.. ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. అవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలని తెలిపారు. అవసరమైనచోట అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వరంగల్‌లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవసరమైన చోట హైడ్రా సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. 24 గంటలు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని అధికారులను ఆదేశించారు.


అధికారులతో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు, కలెక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలాగే.. కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధింత జిల్లా ఇంచార్జ్ మంత్రికి తెలియజేయాలని పేర్కొన్నారు. కాలువలు, వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. ప్రాజెక్టుల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వివరించారు. ప్రాణనష్టం, పశు నష్టం, పంట నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏ ఒక్కరి ప్రాణాలకు నష్టం జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ్టి వరంగల్ ఆకస్మిక పర్యటన వాయిదా వేసుకున్నట్లు రేవంత్ వెల్లడించారు.


కాగా, రేపు (శుక్రవారం) వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారులు బాధితులను ఆదుకునే ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను సిద్ధం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

Home Minister Amit Shah: పీఎం, సీఎం..రెండు పదవులూ ఖాళీ లేవు

Former Bangladesh PM Sheikh Hasina: భారత్‌లో స్వేచ్ఛగా ఉన్న..బంగ్లాదేశ్‌కు వెళ్లే ఉద్దేశం లేదు

Updated Date - Oct 30 , 2025 | 02:31 PM