Papanna Goud Foundation Stone: బహుజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:31 PM
రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో తాము చేసి చూపించామంటూ గర్వంగా చెప్పారు సీఎం. పక్కా ప్రణాళిక ప్రకారం శాస్త్రీయంగా కులగణన చేసి చూపించామని ధీమా వ్యక్తం చేశారు. కులగణన ద్వారా బహుజనుల సంఖ్య 56.33 శాతంగా ఉందని తేల్చామని తెలిపారు.
హైదరాబాద్: బహుజనుల సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మైనింగ్ పేరుతో ఖిలాషాపూర్ కోట చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు. ఇవాళ(సోమవారం) సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటుకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. గత ప్రభుత్వం ఖిలాషాపూర్ కోటపై కుట్రలు చేసిందని.. ఆనాడే కోటపైకి వెళ్లి దాన్ని కాపాడి చారిత్రక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి.
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దే నాయకత్వాన్ని గాంధీ కుటుంబం అందించిందని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశ సమగ్రత కోసం కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర నిర్వహించారని పేర్కొన్నారు. ఆ సందర్భంగా కులగణన చేసి తీరుతామని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారని, గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే అది శిలాశాసనమే అని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో తాము చేసి చూపించామంటూ గర్వంగా చెప్పారు సీఎం. పక్కా ప్రణాళిక ప్రకారం శాస్త్రీయంగా కులగణన చేసి చూపించామని ధీమా వ్యక్తం చేశారు. కులగణన ద్వారా బహుజనుల సంఖ్య 56.33 శాతంగా ఉందని తేల్చామని తెలిపారు. విద్య, ఉద్యోగ, ఉపాధితోపాటు రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపామని గుర్తు చేశారు.
గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన చట్టం బీసీలకు శాపంగా మారిందని, అందుకే దాన్ని సవరిస్తూ చేసిన ఆర్డినెన్స్ గవర్నర్‌కు పంపితే ఆయన రాష్ట్రపతికి పంపారని వెల్లడించారు. 5 నెలలు గడిచినా బిల్లులను ఆమోదించకపోవడంతో బహుజనుల కోసం ఢిల్లీలో ధర్నా సైతం చేశామని పేర్కొన్నారు. బహుజనుల కోసం తాము చేసిన ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు ఎందుకు రాలేదంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి, నరేంద్ర మోదీ కాదా? అంటూ నిలదీశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చట్టంలోనే లేదు.. ఎందుకు అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో బీసీల్లో ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించగలరా? అంటూ సూటి ప్రశ్నలు వేశారు ముఖ్యమంత్రి. 56 ఏళ్లుగా ఇవి అమలు జరుగుతున్నాయని, మతం ముసుగులో బహుజనుల రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
రాహుల్ గాంధీపై కోపం ఉంటే ఆయనపైనే చూపాలని.. అంతేగాని ఆయన సిద్ధాంతాలపై చూపొద్దంటూ హితబోధ చేశారు. రాహుల్ గాంధీ సూచనలను అమలు చేయడం తమ బాధ్యతని, సమస్య వచ్చినప్పుడు పోరాడేందుకు బహుజనుల నైతిక మద్దతు ఉండాలని కోరారు. విద్య ఒక్కటే బహుజనుల తలరాతలు మారుస్తుందని, నాణ్యమైన చదువు, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఉద్ఘాటించారు. బహుజనులంతా ఉన్నత చదువులు చదివి రాజ్యాధికారం సాధించాలని, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విగ్రహాలు అనేవి వర్ధంతులు, జయంతుల కోసం కాదని, వారి స్ఫూర్తిని రగిలించిందుకే అని చెప్పుకొచ్చారు. అందుకే రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయం సమీపంలో పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు రేవంత్.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం, ఇంట్లో ఒంటరిగా ఉన్న పన్నెండేళ్ల బాలిక హత్య
కేంద్రం నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి.. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
Read latest Telangana News And Telugu News