CM Revanth On CPI Sudhakar: సురవరం సుధాకర్ రెడ్డి మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..
ABN , Publish Date - Aug 23 , 2025 | 07:08 AM
సురవరం సుధాకర్ రెడ్డి రెండు సార్లు నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకున్ని కోల్పోయామని సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
హైదరాబాద్: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మరణం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సురవరం సుధాకర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగారని, వామపక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాల్లో పాలు పంచుకున్నారని గుర్తు చేసుకున్నారు. రెండు సార్లు నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకున్ని కోల్పోయామని సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సుధాకర్ రెడ్డి మృతిపట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రెండు సార్లు నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి నిబద్ధత గల నాయకుడని కొనియాడారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న గొప్ప నాయకున్ని కోల్పోయామని మంత్రి తన బాధను వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నట్లు తెలిపారు.అనంతరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అలాగే.. సుధాకర్ రెడ్డి మరణం పట్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దేశ రాజకీయాలలో ఆయనది చెరగని ముద్ర అని కొనియాడారు. నిబద్ధత, క్రమశిక్షణ, నిజాయతీ ఆయన సొంతమని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూనే అందరితో కలిసి పనిచేసిన అజాతశత్రువు సుధాకర్ రెడ్డి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి..
చట్టంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు
వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్