Online Gaming Bill: చట్టంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు
ABN , Publish Date - Aug 22 , 2025 | 07:40 PM
మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025'ను లోక్‌సభ ఈనెల 20న ఆమోదించగా, 21న రాజ్యసభ ఆమోదం పొందింది.
న్యూఢిల్లీ: ఈ-స్పోర్ట్‌ను ప్రమోట్ చేస్తూ, మనీ గేమింగ్ రిస్క్‌లకు కళ్లెం వేసే కీలకమైన 'ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు' అధికారికంగా చట్టంగా మారింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025'ను లోక్‌సభ ఈనెల 20న ఆమోదించగా, 21న రాజ్యసభ ఆమోదం పొందింది. ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారంనాడు ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ చట్టం వెంటనే అమల్లోకి వచ్చింది.
'ఆన్‌లైన్ గేమింగ్' చట్టం ప్రకారం డబ్బుతో ఆడించే అన్ని అన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను పూర్తిగా నిషేధించినట్టయింది. అక్రమంగా నడిపే వారికి 3 సంవత్సరాల జైలు, రూ. ఒక కోటి వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రకటనలకు ప్రచారం చేస్తే రెండేళ్ల జైలు, రూ.50 లక్షల వరకూ జరిమానా ఉంటుంది.
ఈ బిల్లు ఆమోదం పొందితే ఈ రంగంపై ఆధారపడి ఉద్యోగాలు చేస్తున్నవారు ఇబ్బందులు పడతారని ప్రతిపక్ష సభ్యులు ఉభయసభల్లోనూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆ భయాలు అర్థరహితమని కేంద్ర ప్రభుత్వం కొట్టివేసింది. ఈ బిల్లు ప్రకారం అన్ని రకాల ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌తో పాటు ఆన్‌లైన్ ఫాంటసీ స్పోర్ట్స్, ఆన్‌లైన్ లాటరీలు కూడా నిషేధం. డబ్బులు పెట్టి ఆన్‌లైన్‌లో ఆడే అన్ని క్రీడల పైనా నిషేధం అమలవుతుంది. ఇకపై, ఆన్‌లైన్ గేమ్‌లను ప్రమోట్ చేసిన వారు, ఆన్‌లైన్ గేమ్‌లకు సంబంధించి ఆర్థిక లావాదేవీలను నిర్వహించే బ్యాంకులు, సంస్థలు కూడా నేరస్థుల కిందకే వస్తాయి. అయితే డబ్బు ప్రమేయం లేని ఈ-స్పోర్ట్స్ మాత్రం చట్టబద్ధమే అవుతాయి. మానసికోల్లాసం, నైపుణ్యాభివృద్ధి కోసం సోషల్, ఎడ్యుకేషన్ గేమ్స్‌ను ఆడుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్
పార్లమెంట్‌లోకి ఆగంతకుడు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
For More National News And Telugu News