Share News

CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు డబుల్ ధమాకా.. దీపావళికి మరో బోనస్..

ABN , Publish Date - Sep 22 , 2025 | 01:50 PM

తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని రేవంత్ పేర్కొన్నారు. అందుకోసమే లాభాల్లో వాటా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు డబుల్ ధమాకా.. దీపావళికి మరో బోనస్..
CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఒక్కో సింగరేణి కార్మికుడికి దసరా కానుకగా రూ. 1,95,610 ప్రకటించిన విషయం తెలిసిందే. సింగరేణి నుంచి రూ. 2360 కోట్ల లాభంలో 34 శాతం సింగరేణి కార్మికులకు పంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇవాళ(సోమవారం) సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్రను ఎవరూ మరువలేరని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో ప్రత్యేక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అది తాము ఎప్పుడూ మర్చిపోమని తెలిపారు.


రాష్ట్ర ఆదాయంలో సింగరేణిది కీలక పాత్ర..

తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే లాభాల్లో వాటా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రూ. 2360 కోట్ల లాభాలు కార్మికులకు ఇవ్వడానికి కేటాయింపు చేశామని చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5500 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సింగరేణి ప్రాంతంలో రెండు గనులు ప్రైవేట్ సంస్థలకు అప్పగించారని చెప్పుకొచ్చారు. ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన గనులను కూడా తిరిగి సింగరేణికి ఇచ్చే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సీఎం అన్నారు.


దీపావళికి మరో బోనస్..

సింగరేణి కార్మికులకు దీపావళికి మరో బోనస్ ప్రకటిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడేలా సింగరేణిని తీర్చి దిద్దుకోవాలని ఆయన సూచించారు. సింగరేణికి విద్యుత్ సంస్థలు, విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన క్రాస్ సబ్సిడీ పెండింగ్ ఉందని గుర్తు చేశారు. ఈ బకాయిలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్‌ను వచ్చే ఐదేళ్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి:

జమ్ము సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్ కదలికలు..బీఎస్ఎఫ్ గాలింపు చర్యలు

GST Rate Cut: జీఎస్టీ జోష్‌

Updated Date - Sep 22 , 2025 | 02:33 PM