CM Revanth Reddy: నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే చేసిన పాపాలు పోవు
ABN , Publish Date - Sep 08 , 2025 | 06:40 PM
కొందరు తాటిచెట్టులా పెరిగినా బుద్ధి మాత్రం పెరగలేదంటూ ప్రతిపక్ష నేతకు సీఎం రేవంత్ రెడ్డి చురకలంటించారు. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు తీసుకు రావట్లేదన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే హైదరాబాద్‌కు గోదావరి జలాలు వస్తున్నాయని వివరించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 08: నిజాం సర్కార్ దూరదృష్టితో జంట జలాశయాలను నిర్మించడం వల్లే నగరానికి వచ్చిన వాళ్లకు తాగునీరు అందుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం నాడు హైదరాబాద్ సమీపంలోని గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2, 3కి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా హైదరాబాద్ జల మండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 జలాశయాలను ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆనాటి మున్సిపల్ మంత్రి శామీర్‌పేట వద్ద గోదావరి నీళ్లు నెత్తి మీద చల్లుకున్నారని గుర్తు చేశారు. నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే మీరు చేసిన పాపాలు ఎక్కడికి పోవంటూ బీఆర్ఎస్ నేతలకు ఆయన చురకలంటించారు. మూసీ నదిలో ప్రవహించే నీరు విషంగా మారి పశువులు, మనుషుల ప్రాణాలు తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నది నల్గొండకు విషాన్ని మోసుకెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఎవరు ఏమన్నా మూసీ నది ప్రక్షాళన చేస్తున్నామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చేందుకే ఈ ప్రాజెక్టు అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల్లోనే హైదరాబాద్‌కు గొప్ప పేరుందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఏడాదికి 3 శాతం జనాభా హైదరాబాద్‌కు వలస వస్తోందని గణాంకాలతో సహా వివరించారు. తాగు నీటి అవసరాలు అంతకంతకూ పెరుగుతున్నాయని చెప్పారు. వేసవి వచ్చిందంటే సచివాలయం ఎదుట నిరసనలు ఉండేవని గుర్తు చేసుకున్నారు. పీజేఆర్ పోరాటంతోనే హైదరాబాద్‌కు మంజీరా జలాలు వచ్చాయన్నారు.
హైదరాబాద్‌కు దాహార్తి తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ ప్రజల కోరిక మేరకే మూసీ ప్రక్షాళన చేస్తున్నామని వివరించారు. మూసీ ప్రక్షాళనపై ఎవరు అడ్డం పడ్డా ముందుకెళ్తున్నామన్నారు. మూసీ కాలుష్యం నుంచి నల్గొండ ప్రజలకు విముక్తి కల్పిస్తామని చెప్పారు. మూసీలో హైదరాబాద్ డ్రైనేజీ కలవకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్‌కు తాగునీరు అందుతుందన్నారు. నల్గొండ ఫ్లోరైడ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కొందరు తాటిచెట్టులా పెరిగినా బుద్ధి మాత్రం పెరగలేదంటూ ప్రతిపక్ష నేతకు చురకలంటించారు. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు తీసుకు రావట్లేదన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే హైదరాబాద్‌కు గోదావరి జలాలు వస్తున్నాయని వివరించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేశారు. ప్రాణహిత-చేవెళ్లతో రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. త్వరలో మహారాష్ట్ర వెళ్లి అక్కడి సీఎంతో మాట్లాడతానన్నారు. తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణంపై వారితో చర్చలు జరుపుతామని తెలిపారు.
పదేళ్లలో మూసీ ప్రక్షాళనపై కేసీఆర్ ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. మూసీ నది ప్రక్షాళన హైదరాబాదులో ఎందుకు చేసుకోకూడదంటూ ప్రతిపక్షాలను ఆయన సూటిగా ప్రశ్నించారు. మోదీ, యోగి ఆదిత్యనాథ్, రేఖా గుప్తా తమ తమ రాష్ట్రాల్లోని నదులను ప్రక్షాళన చేసుకోవచ్చా? అంటూ వ్యంగ్యంగా బీజేపీ నేతలను ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనతో కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందనే వారి భయమన్నారు. మూడు నెలల్లో ప్రపంచ నగరాల్లో హైదరాబాద్‌ను మేటిగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
కాంగ్రెస్ సీఎంల ప్రణాళికల వల్లే హైదరాబాద్ ఈ స్థాయికి చేరుకుందని వివరించారు. కడుపులో విషం పెట్టుకుని ప్రాజెక్టులు ఆపకండంటూ ప్రతిపక్షాలకు ఆయన సూచించారు. కలిసి రండి.. హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేసుకుందామంటూ పిలుపునిచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తమ ప్రభుత్వం తిప్పికొడుతుందన్నారు.
మూసీ పునరుజ్జీవ పథకానికి శ్రీకారంలో భాగంగా ఈ రోజు.. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపేలా ప్రణాళికలు రూపొందించారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ II & III పథకాలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రూ.7,658 కోట్లతో హ్యామ్ విధానంలో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపడుతుంది. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
వాస్తవాలు చెబితే.. తప్పు పట్టిన బీఆర్ఎస్
ఆలయాల అభివృద్ధిపై సమీక్ష.. సీఎం కీలక ఆదేశాలు
For More TG News And Telugu News