K Rammohan Naidu: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి చురకలు
ABN , Publish Date - Mar 02 , 2025 | 05:15 PM
K Rammohan Naidu: వరంగల్‌లోని మామునూరు ఎయిర్ పోర్ట్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత రెడ్డి చేస్తున్న ప్రకటనలపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తనదైన శైలిలో స్పందించారు. విమానాశ్రయాలను నిర్మించేది రాష్ట్ర ప్రభుత్వాలు కాదంటూ సీఎం రేవంత్ రెడ్డికి చురకలంటించారు.
హైదరాబాద్, మార్చి 02: వరంగల్‌లోని మామునూరులో ఎయిర్ పోర్ట్ క్లియరెన్స్‌కు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఈ నేపథ్యంలో ఆ క్రెడిట్ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానిదేనంటూ ఆ పార్టీ అగ్రనేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వేళ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన చురకలంటించారు. తెలంగాణ సీఎం రేవంత రెడ్డి కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లు ఉన్నారన్నారు.
ఎయిర్ పోర్టులు నిర్మించేది ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని గుర్తు చేశారు. అంతేకాని రాష్ట్రప్రభుత్వాలు కాదంటూ చురకలంటించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూసేకరణ మాత్రమే చేస్తుందని ఆయన వివరించారు. మీరు అధికారంలోకి వచ్చే నాటికీ తెలంగాణ రాష్ట్రం సర్ ప్లస్ ( నిధులు మిగులు) రాష్ట్రంగా ఉందని.. కానీ నేడు అదే రాష్ట్రం అప్పుల పాలు ఎలా అయిందో జవాబు చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను ప్రజలకు చెప్పి.. వాటిని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆగం చేశాయంటూ మండిపడ్డారు.
తాము మాట ఇచ్చామని.. అందుకు అనుగుణంగా వరంగల్ ఎయిర్ పోర్ట్‌ను ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అందుకోసం ఎంత తొందంగా భూసేకరణ చేస్తారో చూస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సవాల్ విసిరారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం, నిజామాబాద్‌లలో కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఇక ఆ యా ప్రాంతాల్లో భౌగోళిక పరంగా సాధ్యాసాధ్యాలపై తమ టెక్నీకల్ టీం సర్వే చేస్తుందన్నారు.
Also Read: మహాకుంభమేళ ప్రాంతం ప్రస్తుతం ఎలా ఉందంటే..
మామునూరులోఎయిర్ పోర్టు ఏర్పాటుకు కేంద్రం శనివారం అంటే.. మార్చి 1వ తేదీన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మామునూరులో ఎయిర్ పోర్ట్ వద్ద కాంగ్రెస్, బీజేపీ కేడర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
Also Read: సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు టైం దొరికింది
ఈ ఎయిర్ పోర్ట్ ఘనత తమదంటే తమదంటూ ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఆ క్రమంలో ప్రధాని మోదీ చిత్ర పటానికి పుష్పాభిషేకం చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల చిత్ర పటాలతో కూడిన ఫ్లెక్సీలతో మామునూరు ఎయిర్ పోర్ట్ వద్దకు చేరుకుని బిగ్గరగా నినాదాలు చేపట్టారు. వారి చిత్ర పటాలకు పాలాభిషేకం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రయత్నించాయి. వారి ప్రయత్నాన్ని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింప చేశారు. ఇక రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఇదే తరహాలో వ్యవహరించడంతో .. కేంద్ర మంత్రిపై విధంగా స్పందించారు. అంతేకాదు.. ఎయిర్ పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించదని.. ఎయిర్ పోర్టు ఆథారిటి ఆఫ్ ఇండియా నిర్మిస్తుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
For Telangana News And Telugu News