Share News

Raghunadhan Rao: సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు టైం దొరికింది

ABN , Publish Date - Mar 02 , 2025 | 03:21 PM

Raghunadhan Rao: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో రేవంత్ రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసిందని.. ఆ విషయాన్ని ఆయన మరిచిపోయినట్లు ఉన్నారని వ్యంగ్యంగా అన్నారు.

Raghunadhan Rao: సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు టైం దొరికింది
BJP MP M Raghunadhan rao

హైదరాబాద్, మార్చి 02: ఎస్ఎల్‌బీసీ వద్దకు వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డికి 8 రోజుల వరకు టైమ్ దొరకలేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు వ్యంగ్యంగా ఆరోపించారు. తెలంగాణలో పాలన పడకేసిందని ఆయన విమర్శించారు. పాలన చేతకాక ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్రం కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు విలేకర్లతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చారని.. ఓ వేళ రాహుల్‌ గాంధీని కలిస్తే.. ఒక్క ఫోటో కూడా ఎందుకు విడుదల చేయలేదని కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు.

పేరుకు మాత్రం పీసీసీ అధ్యక్ష పదవి బీసీకి ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి సైతం బీసీలకు ఇవ్వాలని అధిష్టానానికి లేఖ రాయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌కు ఎంపీ రఘునందన్ రావు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓ ఉన్నతాధికారి.. గత ఐదేళ్లుగా డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. మున్సిపల్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డికి పట్టు లేదన్నారు.


మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు..

ఇక వరంగల్‌లో ఏర్పాటు కానున్న మమునూరు ఎయిర్ పోర్ట్‌ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన స్పష్టం చేశారు. గద్వాల్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే తన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల్లో వేస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలంతా తిరిగి తమ సొంత గూటికి వెళ్లేందుకు సిద్దమవుతోన్నారన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సౌమ్యుడని.. ఆయనపై మాట్లాడే హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు.


దుస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి..

ఆరు మంత్రి పదవులను భర్తీ చేసుకోలేని దుస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పారు. ప్రధాని మోదీతో కలిసిన ఫొటో అధికారికంగా విడుదల చేశారని.. మరి రాహుల్ గాంధీని కలిసిన ఫోటో ఎక్కడ? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ రఘునందన్ రావు సూటిగా ప్రశ్నించారు. త్రిభాషా సిద్దాంతానికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీనేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.


ఎవరికి భయపడి రాస్తున్నారు..

అలాంటి కాంగ్రెస్ సిద్దాంతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. అయినా.. తెలంగాణలో ఉర్దూ భాష ఎందుకు రాస్తున్నారని ప్రశ్నించారు. 90 శాతం ప్రజలకు ఉర్దూ రాకున్నా.. బోర్డులపై ఎందుకు ఆ భాషను రాస్తున్నారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఎవరికి భయపడి ఉర్దూ భాష రాస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన బల్ల గుద్ది ప్రశ్నించారు.


సీఎం రేవంత్‌కి ఎంపీ రఘునందన్ సవాల్..

అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడు అనుమతి తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి తెలుగులో మాట్లాడరని ఈ సందర్బంగా ఎంపీ రఘునందన్ రావు గుర్తు చేశారు. మరి పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ భాషలో మాట్లాడతారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలపై తాము మాట్లాడగలమని కానీ.. సిద్దాంతం మీద.. ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధమన్నారు. వేదిక, సమయం చెప్పాలంటూ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు సవాల్ విసిరారు.


సీఎం రేవంత్‌కు చురకలు..

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఏసీబీ కేసు పెట్టిందని.. దానికి కేంద్రానికి ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. అయితే కేటీఆర్‌ను అరెస్ట్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారన్నారు. అయినా.. గతంలో ఏసీబీ అరెస్ట్ చేసిన విషయాన్ని మరిచిపోయినట్లు ఉన్నారంటూ సీఎం రేవంత్‌‌కు చురకలంటించారు.


అప్పుడే డిలిమిటేషన్ జరిగేది..

బయ్యారం స్టీల్ ప్లాంట్ ఫీజిబులిటీ ఉంటేనే ఇవ్వాలని పునర్విభజన చట్టంలో ఉందని.. కానీ దానికి ఫీజిబులిటీ లేదని తేలిందన్నారు. డిలిమిటేషన్ జరగాలంటే.. ముందు జనగణన జరగాల్సి ఉందన్నారు. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పదేళ్లు కావస్తోందని.. ఆయన ముఖం చెల్లకే హిందీ భాష, డిలిమిటేషన్ అంశాలతో తన కొడుకుని ముఖ్యమంత్రిని చేయ్యాలని అనుకొంటున్నారన్నారు. అయితే 2026 చివరలోనే డిలిమిటేషన్ జరిగేదని ఎంపీ రఘునందన్ రావు వెల్లడించారు.

For Telangana News And Telugu News

Updated Date - Mar 02 , 2025 | 03:31 PM