Bandi Sanjay: ఈసీని మేనేజ్ చేస్తే.. అన్ని సీట్లే ఎందుకు వస్తాయి
ABN , Publish Date - Aug 15 , 2025 | 07:01 PM
ఓట్లు గల్లంతు విషయంలో ఎన్నికల సంఘానికి, బీజేపీకి, ప్రధాని మోదీకి ఏం సంబంధమంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. దీనిపై ఫిర్యాదు చేస్తే.. ఈసీ చర్యలు తీసుకుంటుందన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 15: తెలంగాణలో తిరంగా ర్యాలీలు ఘనంగా నిర్వహించారని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖత్వంతో జెండాలు ఎగురవేయనీయ లేదని ఆయన మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం ప్రధాని మోదీ ఆలోచన అని పేర్కొన్నారు. మోదీ పాలనకు ముందు పరిస్థితి.. ఆ తర్వాత ఏమిటనేది ప్రజలు చూస్తున్నారని చెప్పారు. అవినీతి రహిత పాలన అందిస్తున్నారంటూ ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. రెండు రాజ్యాంగాలు అవసరం లేదంటూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోరాటం చేశారని వివరించారు.
ఓట్లు గల్లంతు విషయంలో ఎన్నికల సంఘానికి, బీజేపీకి, ప్రధాని మోదీకి ఏం సంబంధమంటూ ఆయన ప్రశ్నించారు దీనిపై ఫిర్యాదు చేస్తే.. ఈసీ చర్యలు తీసుకుంటుందన్నారు. ఎన్నికల సంఘాన్ని తాము మేనేజ్ చేసేలా ఉంటే 240 ఎంపీ సీట్లకు ఎందుకు పరిమితమవుతామంటూ ప్రతిపక్షాలను బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక్క ఇంట్లోనే 300 ఓట్లు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ వాళ్లు 60 ఏళ్ళు దేశాన్ని దోచుకున్నారని.. దీనిపై తాము మీరు రిగ్గింగ్ చేశారని ఎప్పుడైనా అన్నామా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరి అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్‌లో మీ పార్టీని నమ్మరని.. అక్కడ గెలిచేది బీజేపీనే అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వానికి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఇక మార్వాడీలు గో బ్యాక్ అనేది కొంతమంది కమ్యునిస్టులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలతో కలిసి నేతలు ఆడుతున్న నాటకమని ఆయన అభివర్ణించారు. గుజరాతీలు, మార్వాడీలు సంపద దోచుకునేందుకు రాలేదన్నారు. వారు వ్యాపారాలు చేసుకుని రాష్ట్ర సంపదను పెంచేందుకు వస్తున్నారని వివరించారు. దమ్ముంటే నగరంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాల గురించి మాట్లాడాలంటూ రాజకీయ పార్టీలకు ఆయన సవాల్ విసిరారు. వాళ్ళ వల్లే బాంబు పేలుళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. మైనారిటీలు.. అన్ని వృత్తులలోని బీసీల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్వాడీలు ఎవరి ఉత్పత్తులు దోచుకోవడం లేదని పేర్కొన్నారు. ఇది ఒక కుట్ర అని ఆయన అన్నారు. హిందూ సమాజం జాగృతం అవుతుందని.. ఆ క్రమంలో రోహింగ్యాలు గో బ్యాక్ అని తాము అంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం దంపతులు
Read Latest Telangana News and National News