Share News

BRS Leaders Reaction On kavitha suspension: కవితపై వేటు.. సంతోషిస్తున్న మహిళలు

ABN , Publish Date - Sep 02 , 2025 | 06:04 PM

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆ పార్టీ నేతలు హరీష్ రావు, సంతోష్ రావు కారణంగానే అవినీతి మరకలు అంటాయంటూ కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెపై పార్టీ చీఫ్ కేసీఆర్ వేటు వేశారు. దీంతో పార్టీలోని సీనియర్ మహిళా నేతలు స్పందించారు.

BRS Leaders Reaction On kavitha suspension: కవితపై వేటు.. సంతోషిస్తున్న మహిళలు

హైదరాబాద్, సెప్టెంబర్ 02: తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సస్పెన్షన్ వేటు వేయడంపై ఆ పార్టీలోని సీనియర్ నేతలు స్వాగతిస్తున్నారు. ఈ సందర్బంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ.. మూడు నెలలుగా కవిత చేస్తున్న ఆరోపణలపై తమ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తమ పార్టీ నాయకుడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. ఆయన నిర్ణయానికి తాము మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. కవితను సస్పెండ్ చేయడంతో మహిళలు ఎక్కువగా సంతోషిస్తున్నారని పేర్కొన్నారు. కవిత తీరు బీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పారు.


సోమవారం కవిత చేసిన వ్యాఖలతో కేసీఆర్ చాలా బాధపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాన్ని నివారించడం కోసం కార్యకర్తలకు మనో ధైర్యం ఇవ్వడం కోసం కవితని సస్పెండ్ చేశారని వివరించారు. పార్టీకి నష్టం చేస్తే సొంత కుటుంబ సభ్యులపైన కూడా చర్యలు తీసుకుంటానని కేసీఆర్ గతంలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ గుర్తు చేశారు. కోట్ల మంది పార్టీ కార్యకర్తల కంటే పేగు బంధం ఎక్కువ కాదంటూ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తాము ఎన్నిసార్లు చెప్పినా కవిత.. తన వైఖరిని మాత్రం మార్చుకోలేదన్నారు. పార్టీ కంటే ఎవరు పెద్ద కాదని చెప్పారు. కవిత వ్యాఖ్యలు.. పార్టీ నేతలను మనోవేదనకు గురిచేశాయని చెప్పారు.


కవిత వెనుక ఎవరో ఉండి మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా సందేహం వ్యక్తం చేశారు. తమ నాయకుడి బిడ్డగా కవితంటే తమకు గౌరవం ఉందన్నారు. కానీ ఆమెకు దక్కిన గౌరవాన్ని కాపాడుకో లేక పోయిందని విచారం వ్యక్తం చేశారు. పార్టీ ఉంటే ఎంత పోతే అనడం ఏంటంటూ కవితను ఈ సందర్భంగా ఆమె సూటిగా ప్రశ్నించారు. మరి నువ్వు ఉంటే ఏంటి? పోతే ఏంటి? అంటూ కవితకు సత్యవతి రాథోడ్ చురకలంటించారు. బిఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తానంటే తానే వద్దనట్లు కవిత చెప్పారని.. అలాంటి ఆమె మీద కేసీఆర్‌కు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందని పేర్కొన్నారు.


కవిత తనకు తానే గొయ్యి తీసుకుంది..

ఎమ్మెల్సీ కవిత తనకు తానే గొయ్యి తీసుకుందని గొంగిడి సునీత స్పష్టం చేశారు. కేసీఆర్‌ను గౌరవించినట్లే కవితను సైతం తెలంగాణ సమాజం గౌరవించిందని గుర్తు చేశారు. బిఆర్ఎస్ ఉంది కాబట్టే కవితకు ఎంపీగా, ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు బి ఫాం ఇచ్చారన్నారు. అది మరిచి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో అడుగు పెట్టీ చూడండంటూ కవితకు గొంగడి సునీత సవాల్ విసిరారు. నిన్ను నిలదీసేందుకు సిద్ధంగా ప్రజలు ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నీకు నచ్చక పోవచ్చు.. కానీ తెలంగాణ సమాజం మాత్రం బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటుదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన వారిలో మీరు ఒకరిగా మిగలాలంటే తాము చేసేది ఏమిలేదని కవితకు గొంగడి సునీత సూచించారు.


కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: మాలోతు కవిత

బీఆర్ఎస్ పార్టీలోని సీనియర్ నేతలు హరీష్ రావు, సంతోష్‌లపై కవిత చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. ఈ పార్టీని నమ్ముకుని ఎంతో మంది ఉన్నారని చెప్పారు. అలాంటి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటే బాధేసిందన్నారు. పేగు బంధం కంటే పార్టీ బంధం గొప్పదని కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. కేసీఆర్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు.


కాంగ్రెస్ పార్టీ మాటలకు కవిత లొంగిపోయింది: ఎమ్మెల్యే పల్లా

పార్టీ కార్యకర్తల నిర్ణయం మేరకే కల్వకుంట్ల కవిత సస్పెండ్ చేసినట్లు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.


కవిత వ్యాఖ్యలు వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆయన కుండ బద్దలు కొట్టారు. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలను చీల్చి వారి కుటుంబాలలో చిచ్చు పెట్టడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అంటూ అభివర్ణించారు. కర్ణాటక, తమిళనాడులో సైతం కాంగ్రెస్ పార్టీ ఇదే చేసిందని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ మాటలకు కవిత లొంగిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కవిత సస్పెండ్‌ను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ స్వాగతిస్తున్నారని గుర్తు చేశారు.


మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి..

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. కొంతకాలంగా పార్టీకి నష్టం కలిగించేలా కవిత వ్యవహరిస్తున్నారన్నారు. కవిత సస్పెన్షన్ విషయంలో పార్టీ సరైన నిర్ణయం తీసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ తన కుమార్తె కవిత కంటే పార్టీ భవిష్యత్తు ముఖ్యమని సందేశం ఇచ్చారన్నారు. అయితే కవిత చేస్తున్న ఆరోపణలను ఎవరూ విశ్వసించరని గుర్తు చేశారు. కష్ట కాలంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉండాల్సిన కవిత శత్రువులకు చేయూతనివ్వడంతో తమ మనసులు బాధిస్తున్నాయని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత ప్రభావం ఏమీ ఉండదంటూ ఆయన జోస్యం చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పంపకాల్లో తేడా వచ్చింది అందుకే..: ఎంపీ అనిల్ కుమార్ యాదవ్

రోడ్డు ప్రమాదం.. విద్యార్థులు మృతి

For More TG News And Telugu News

Updated Date - Sep 02 , 2025 | 06:35 PM