Share News

Road Accident: రోడ్డు ప్రమాదం.. విద్యార్థులు మృతి

ABN , Publish Date - Sep 02 , 2025 | 04:31 PM

బ్రిటన్‌లో వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు మరణించారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకొన్నాయి.

Road Accident: రోడ్డు ప్రమాదం.. విద్యార్థులు మృతి
Chaitanya Tarre, Rishiteja Rapolu

లండన్, సెప్టెంబర్ 02: బ్రిటన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం ఎసెక్స్ నగరంలో ఈ ప్రమాదం జరిగింది. వినాయక చవితి పండగ నేపథ్యంలో గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసి వీరంతా తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకున్నాయి. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. మృతులను గుర్తించామన్నారు. మృతులు.. నాదర్‌గుల్ వాసి తర్రె చైతన్య (23), బోడుప్పల్‌కు చెందిన రాపోలు రిషితేజా (21) అని వివరించారు.


బిటెక్ పూర్తి చేసిన చైతన్య.. మాస్టర్ డిగ్రీ చేసేందుకు ఎనిమిది నెలల క్రితం లండన్ వచ్చాడని చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అతడు అక్కడికక్కడే మృతి చెందారన్నారు. అయితే రిషి తేజా మాత్రం తీవ్ర గాయాలు పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు రాయల్ లండన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.


ఇక ఈ ప్రమాదంలో గాయపడిన గౌతమ్ రావుల, నూతన్ తాటికాయలలు పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన కార్లను డ్రైవ్ చేస్తున్న.. గోపిచంద్ బి, మనోహర్ ఎస్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు. మరోవైపు ఈ ఇద్దరు విద్యార్థుల మృతితో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకొన్నాయి. వీరి మృతదేహాలను సాధ్యమైనంత త్వరగా స్వస్థలాలకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయా కుటుంబ సభ్యులు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాయి.

Updated Date - Sep 02 , 2025 | 04:31 PM