Share News

GHMC: తెలంగాణలో వేడెక్కిన జీహెచ్ఎంసీ రాజకీయం

ABN , Publish Date - Feb 09 , 2025 | 02:19 PM

GHMC: తెలంగాణలో జీహెచ్ఎంసీలో ప్రధాన పార్టీల మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఈనెల 11వ తేదీ తర్వాత మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌ రెడ్డిలపై అవిశ్వాసానికి బీఆర్‌ఎస్‌ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కార్పొరేట్లర్లు కూడా అవిశ్వాసానికి పట్టుబడుతున్నారు.

GHMC: తెలంగాణలో వేడెక్కిన  జీహెచ్ఎంసీ రాజకీయం
GHMC

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (GHMC) రాజకీయం వేడెక్కింది. మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి కౌంట్ డౌన్ షురూ అయింది. రేపటికి బల్దియా పాలక మండలికి నాలుగేళ్లు పూర్తి అవుతుంది. ఫిబ్రవరి 11 తర్వాత ఏ క్షణమైనా జీహెచ్ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌ రెడ్డిలపై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డితో జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు ఇవాళ (ఆదివారం) సమావేశం అయ్యారు. రెండు రోజుల్లో మాజీ మంత్రి కేటీఆర్‌తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం కానున్నారు. మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశాలతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఎల్లుండి మేయర్‌తో కాంగ్రెస్ కార్పొరేటర్లు సమావేశం కానున్నారు. అవిశ్వాస తీర్మానంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది.


వ్యూహాలు రచిస్తున్న బీఆర్ఎస్...

కాగా, మేయర్‌ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్‌ఎస్‌ యోచిస్తోంది. తమ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా గెలిచి జీహెచ్‌ఎంసీ మేయర్‌ పదవిని చేపట్టిన విజయలక్ష్మి.. కాంగ్రెస్‌లోకి మారిన నేపథ్యంలో ఈ ఆలోచన చేస్తోంది. తద్వారా రాజకీయంగా గ్రేటర్‌ హైదరాబాద్‌పై పట్టు నిలుపుకొనే వ్యూహాలు రచిస్తోంది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ నివాసంలో గ్రేటర్‌ పరిధిలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమావేశమైన విషయం తెలిసిందే.


మద్దతు కూడగట్టడంపై కసరత్తు..

ఈ సందర్భంగా మేయర్‌పై అవిశ్వాసం విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీకి ప్రస్తుతం ఉన్న బలం ఎంత? ఇతర సభ్యుల మద్దతు కూడగట్టడం ఎలా? అన్న అంశాలపై ఈ భేటీలో మాట్లాడారు. గ్రేటర్‌పై పట్టు జారలేదన్న సంకేతాలిచ్చేలా అవిశ్వాసం ఉండాలని, ఒకవేళ తగినంత మంది సభ్యుల మద్దతులేక అవిశ్వాసం వీగిపోతే.. ప్రతికూల పరిణామాలు ఉంటాయన్న అభిప్రాయమూ వ్యక్తమైనట్టు సమాచారం. అవిశ్వాసం పెట్టాలా? వద్దా? అన్నదానిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఓ ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - Feb 09 , 2025 | 02:26 PM