Jubilee Hills Bye Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కేసీఆర్ కీలక నిర్ణయం..!
ABN , Publish Date - Oct 23 , 2025 | 08:18 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ నేతలతో ఆయన కీలక సమావేశం ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 23: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్‌లో పార్టీ కీలక నేతలతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నియమించిన ఇన్‌చార్జ్‌లతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఆ క్రమంలో కేటీఆర్, హరీష్ రావు, పార్టీలోని సీనియర్లు, ఉప ఎన్నికల ఇన్‌ఛార్జ్‌తోపాటు క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ఈ ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. దీంతో ఈ ఉప ఎన్నిక ప్రచారంపై ఆ యా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ ఉప ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనడంపై కూడా పార్టీ నేతలకు ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 40 మంది స్టార్ క్యాంపెయినర్లను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందుకోసం ఇంటింటి ప్రచారంతోపాటు రోడ్డు షోలు, కార్నర్ మీటింగులు, కుల సంఘాలతో భేటీకి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది.
2023 ఏడాది చివరలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబీహిల్స్ స్థానం నుంచి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయితే అనారోగ్యం కారణంగా ఈ ఏడాది జూన్ మొదటి వారంలో ఆయన చనిపోయారు. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన భార్య సునీతను బరిలో దింపారు. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్, బీజేపీ లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి, కార్మిక నేత పి.జనార్దన్ రెడ్డి కుమారుడు పి. విష్ణువర్ధన్ రెడ్డితో సైతం బీఆర్ఎస్ పార్టీ మరో నామినేషన్ దాఖలు చేయించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బలహీనపడనున్న అల్పపీడనం.. భారీ వర్షాలు
నిపుణులను స్వదేశానికి రప్పిద్దాం
For More TG News And Telugu News