Heavy Rains: బలహీనపడనున్న అల్పపీడనం.. భారీ వర్షాలు
ABN , Publish Date - Oct 23 , 2025 | 07:41 AM
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
అమరావతి, అక్టోబర్ 23: పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం అంటే.. ఈ రోజు బలహీనపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక కర్నూలు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్పారు. అలాగే మిగిలిన జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. చెట్లు కింద నిలబడ వద్దని ప్రజలకు సూచించారు. భారీ వర్షాలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.
మరోవైపు.. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు అత్యధికంగా తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో 19 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయింది. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది.
పొరుగున్న తమిళనాడులో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని 12 జిల్లాల్లో బుధవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఈ భారీ వర్షం ధాటికి లక్షలాది ఎకరాల్లోని వరి పంట నీట మునిగింది. ఈ వర్షం కారణంగా పలువురు మరణించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నిపుణులను స్వదేశానికి రప్పిద్దాం
For More AP News And Telugu News