Indian Government is Planning: నిపుణులను స్వదేశానికి రప్పిద్దాం
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:28 AM
ఉన్నత విద్యపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
విదేశాల్లో స్థిరపడిన భారత సంతతి
నిపుణులను ఆకర్షించేందుకు కేంద్రం ప్లాన్
న్యూఢిల్లీ, అక్టోబరు 22: ఉన్నత విద్యపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా విదేశాల్లో స్థిరపడిన భారతీయ, భారత సంతతి పరిశోధకులు, విద్యా నిపుణులను స్వదేశానికి రప్పించి.. వారిని ఇక్కడి విద్యా సంస్థల్లో బోధించేలా, పరిశోధనలు చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దేశ పరిశోధన, సృజనాత్మక రంగాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో ఇలాంటి ప్రణాళికను పరిశీలించినప్పటికీ.. విధానపరమైన జాప్యం, అనిశ్చిత పరిస్థితులు వంటి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే అమెరికాలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో మోదీ సర్కారు.. ఈ ప్రణాళికను కొత్తగా పరిశీలిస్తోంది. పరిశోధనలు లేదా బోధన కోసం నిర్దిష్ట కాలంపాటు భారత్‌లో గడిపేందుకు సిద్ధంగా ఉన్న వారిని తిరిగి తీసుకురావడం కోసం విద్య, శాస్త్ర సాంకేతిక శాఖలతో సంప్రదించి ఒక పథకాన్ని రూపొందిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో వారికి ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పేర్కొన్నాయి. ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ విజిటింగ్ అడ్వాన్స్‌డ్ జాయింట్ రిసెర్చ్(వజ్ర) ఫ్యాకల్టీ స్కీమ్‌ను నిర్వహిస్తోంది. దీని ద్వారా ప్రవాస భారతీయులు, భారత సంతతికి చెందిన విదేశీ శాస్త్రవేత్తలను స్వదేశానికి తీసుకొచ్చి ప్రభుత్వసంస్థలు, యూనివర్సిటీల్లో నిర్దిష్ట కాలంపాటు పనిచేసేలా చర్యలు తీసుకుంటోంది. అలాగే రామానుజమ్ ఫెలోషిప్ కూడా విదేశాల్లో నివసిస్తున్న భారతీయపరిశోధకులు ఇండియాలోని వర్సిటీల్లో పనిచేయడానికి అవకాశం కల్పిస్తోంది.