Share News

Strategic Defense Hub: వారెవ్వా... విశాఖ

ABN , Publish Date - Oct 23 , 2025 | 05:32 AM

విశాఖపట్నం పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. గూగుల్‌ సంస్థ రూ.1.36 లక్షల కోట్లతో హైపర్‌ స్కేల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ డేటా సెంటర్‌...

Strategic Defense Hub: వారెవ్వా... విశాఖ

  • ‘గూగుల్‌’కు ముందే ‘రక్షణ’లో అంతర్జాతీయ ఖ్యాతి

  • టోర్పడోలు, అణు జలాంతర్గాములు, యుద్ధ నౌకల నిర్మాణ కేంద్రం

  • తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం ఇదే...

  • ప్రత్యామ్నాయ కేంద్రంగా ‘వర్ష’ నిర్మాణం

  • అది... అణు జలాంతర్గాముల స్థావరం

  • కొవ్వాడలో న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంటు

  • డీఆర్‌డీఓ అధీనంలో ఎన్‌ఎస్‌టీఎల్‌

  • ఐఎన్‌ఎస్‌ కళింగలో మిస్సైల్‌ డిపో

  • ఎస్‌బీసీలో అణు సబ్‌మెరైన్ల నిర్మాణం

  • వచ్చే ఏడాది నుంచే పూర్తిగా ‘నేవీ ఎయిర్‌పోర్ట్‌

  • అంతర్జాతీయ స్థాయిలో ‘వ్యూహాత్మక విశాఖ’

(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

‘విశాఖపట్నం’ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. గూగుల్‌ సంస్థ రూ.1.36 లక్షల కోట్లతో హైపర్‌ స్కేల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో విశాఖపట్నం ఎక్కడుందో ప్రపంచ వ్యాప్తంగా వెదుకుతున్నారు. అయితే... అంతకంటే ముందే అగ్ర దేశాలు విశాఖను ‘ప్రపంచ వ్యూహాత్మక రక్షణ కేంద్రం’గా గుర్తించాయి. అమెరికా, చైనా శాటిలైట్లు విశాఖను నిఘా కళ్లతో నిత్యం పరిశీలిస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, దశలవారీగా ఏర్పాటు చేస్తున్న సంస్థలే దీనికి కారణం.


4.jpg

న్యూక్లియర్‌ సబ్‌మెరైన్ల్ల తయారీ కేంద్రం

విశాఖపట్నంలో రెండు నౌకా నిర్మాణ కేంద్రాలు ఉన్నాయి. అందులో ఒకటి హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌. ఇక్కడ భారీ నౌకలతో పాటు సబ్‌మెరైన్ల నిర్మాణం, రీఫిట్‌ పనులు చేస్తారు. నష్టాల్లో ఉన్న ఈ సంస్థను ప్రభుత్వం రక్షణ శాఖ పరిధిలోకి తీసుకువచ్చింది. నేవీకి అవసరమైన ‘సపోర్టింగ్‌ వెజల్స్‌’ ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇది కాకుండా నేవీకి ప్రత్యేకంగా ‘షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌’ (ఎస్‌బీసీ) ఉంది. ఇక్కడ గతంలో యుద్ధ నౌకలు తయారు చేసేవారు. ఇప్పుడు ఇది పూర్తిగా న్యూక్లియర్‌ సబ్‌మెరైన్ల తయారీలో నిమగ్నమైంది. రష్యా సహకారంతో మొదట ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ సబ్‌మెరైన్‌ తయారుచేశారు. ఆ తర్వాత ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌, ఆపై ఐఎన్‌ఎస్‌ అర్థిమాన్‌లను నిర్మించారు. ఎస్‌బీసీలో నాలుగో న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ నిర్మాణంలో ఉంది. ఇది కాకుండా ప్రాజెక్టు-77 పేరుతో మరో ఆరు అధునాతన న్యూక్లియర్‌ సబ్‌మెరైన్ల నిర్మాణానికి గత ఏడాది అక్టోబరులో కేంద్ర రక్షణ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనికి అవసరమైన మౌలిక వసతుల కోసం రూ.40 వేల కోట్ల బడ్జెట్‌ ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో తయారయ్యే మొదటి సబ్‌మెరైన్‌ను జర్మనీకి విక్రయించాలని నిర్ణయించారు. దీనిని రెండేళ్లలో అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇది సుమారు రూ.50వేల కోట్ల ఒప్పందమని తెలుస్తోంది.

కొవ్వాడలో న్యూక్లియర్‌ ప్లాంటుఆ

విశాఖపట్నానికి 70 కిలోమీటర్ల దూరంలోని కొవ్వాడలో న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంటును 2,079 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇక్కడ వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు అణు రియాక్టర్లను నిర్మించనున్నారు. అక్కడ పనిచేసే అధికారుల కోసం టౌన్‌షిప్‌ నిర్మాణం కూడా పూర్తి చేశారు.


నేవీ చేతికి ‘ఐఎన్‌ఎస్‌ డేగా’

విశాఖపట్నంలో నేవీ వైమానిక స్థావరం ఐఎన్‌ఎస్‌ డేగా. విశాఖలో పౌర విమానాశ్రయం నేవీ ఆధ్వర్యంలోనే నడుస్తోంది. ఒకవైపు పౌర విమానాలు, మరో వైపు నేవీ విమానాలు వచ్చి వెళుతుంటాయి. దీనివల్ల ఇక్కడ ఆంక్షలు ఎక్కువ. భోగాపురంలో అధునాతన అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం శరవేగంతో జరుగుతోంది. దీనిని వచ్చే ఏడాది సెప్టెంబరులో ప్రారంభించాలని నిర్ణయించారు. అది ప్రారంభం కాగానే విశాఖ విమానాశ్రయాన్ని పూర్తిగా ఐఎన్‌ఎస్‌ డేగా అవసరాలకు ఉపయోగించుకుంటారు. మరిన్ని యుద్ధ విమానాలు ఇక్కడికి వస్తాయి. శిక్షణ కార్యక్రమాలూ పెరుగుతాయి.

ఏడాదిలో ఆరుసార్లు వచ్చిన రాజ్‌నాథ్‌

విశాఖపట్నం భారతదేశ వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా మారుతోంది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి ఉన్నతస్థాయి అధికారులు తరచూ వస్తున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఏడాదిలో ఆరుసార్లు విశాఖ రావడం గమనార్హం. ఇక... విశాఖలో జరిగిన ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన పర్యటనలో నేవీ ప్రాజెక్టులను కూడా పరిశీలించారు. ఇందుకు కొన్ని గంటలు ప్రత్యేకంగా కేటాయించారు. కొందరు డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు హెలికాప్టర్లలో వచ్చి నడిసముద్రంలో నౌకలపై సమీక్షా సమావేశాలు నిర్వహించుకొని అటు నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లిపోతుంటారు. వీటన్నింటి నేపథ్యంలోనే విశాఖను ప్రపంచ వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా అభివర్ణిస్తున్నారు.


తూర్పు’ సింధూరం...

సాగర తీర నగరమైన విశాఖ వ్యూహాత్మక ప్రత్యేకతను గుర్తించిన కేంద్రం చాలాకాలం క్రితమే ఇక్కడ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దానిని దశల వారీగా అభివృద్ధి చేస్తూ వచ్చింది. భవిష్యత్తు ‘రక్షణ’ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విశాఖకు 50 కిలోమీటర్ల దూరంలోని రాంబిల్లిలో దాదాపు ఐదు వేల ఎకరాల్లో నేవీ ఆల్టర్నేటివ్‌ ఆపరేటింగ్‌ బేస్‌ (ఎన్‌ఏఓబీ) పేరుతో ప్రత్యామ్నాయ స్థావరం ఏర్పాటు చేస్తోంది. దీనికి ‘వర్ష’ అని నామకరణం చేశారు. ఇందులో తొలి దశ వచ్చే ఏడాది అంటే 2026లో ప్రారంభం కానుంది. దీనిని న్యూక్లియర్‌ సబ్‌మెరైన్ల స్థావరంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ డాకింగ్‌ చేసే సబ్‌మెరైన్లు శాటిలైట్లకు కూడా అందవు. నిర్మాణాలన్నీ ‘అండర్‌ గ్రౌండ్‌’లోనే. ‘వర్ష’లో మొత్తం 12 న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్లను ‘డాక్‌’ చేసే అవకాశముంది. ఎన్‌ఏఓబీకి అవసరమైన ‘అణు’ సహకారం అందించేందుకు బాబా అటామిక్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌(బార్క్‌)ను కూడా రాంబిల్లిలో నెలకొల్పారు. సబ్‌మెరైన్లలో ఉపయోగించే అణు రియాక్టర్లను బార్క్‌ తయారుచేసి అందిస్తుంది.

ఐఎన్‌ఎస్‌ కళింగలో మిస్సైల్‌ పార్క్‌

తూర్పు నౌకాదళానికి అవసరమైన ఆయుధ సామగ్రి నిల్వల కోసం భీమునిపట్నం సమీపాన 700 ఎకరాల్లో ‘ఐఎన్‌ఎస్‌ కళింగ’ ఏర్పాటుచేశారు. ఇక్కడే మెరైన్‌ కమెండోలకు శిక్షణ ఇస్తున్నారు. దీనిని ఇటీవల మిస్సైల్‌ పార్కుగా మార్చి ‘అగ్నిప్రస్థ’గా నామకరణం చేశారు. ఇక్కడి నుంచి సముద్రంలోకి రహస్య మార్గం కూడా నిర్మించారని చెబుతారు. ఆకాశ్‌, పృథ్వీ వంటి మిస్సైళ్లు ఇక్కడే ఉన్నాయి.

డీఆర్‌డీఓ పరిశోధనశాలగా ఎన్‌ఎస్‌టీఎల్‌

విశాఖ విమానాశ్రయానికి సమీపంలో నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ లేబొరేటరీ (ఎన్‌ఎ్‌సటీఎల్‌) చాలాకాలం గా ఉంది. నేవీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ అభివృద్ధి చేసేవారు. దీనిని కొద్దికాలం క్రితం డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవల్‌పమెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ)కు అప్పగించి అభివృద్ధి చేస్తున్నారు. భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌తో కలిసి ఇక్కడే ‘వరుణాస్త్ర’ టోర్పడోనూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. భవిష్యత్తులో ఈ కేంద్రం మరిం త కీలకంగా మారనుంది. దీనికి అనుబంధంగా పట్టాభిరెడ్డితోటలో పలు కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడి నుంచో శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి వెళుతుంటారు.

2.jpg1.jpg3.jpg

Updated Date - Oct 23 , 2025 | 05:32 AM