Raghunandan Rao: దొంగ ఓట్లతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు: బీజేపీ ఎంపీ
ABN , Publish Date - Aug 13 , 2025 | 08:19 PM
ఓట్ల చోరీపై బాధ్యత ఉన్న నేతలు సైతం కనీస బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఎందుకు అవసరమనే అంశంపై ఒక చిన్న ఉదాహరణ చెబుతానన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 13: దొంగ ఓట్లతో రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదని బీజేపీ ఎంపీ ఎం. రఘునందన్ రావు స్పష్టం చేశారు. అందుకే ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) చేపడుతున్నామన్నారు. ఈ ప్రత్యేక సమగ్ర సవరణ తెలంగాణలో సైతం జరపాలని ఆయన రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో ఎంపీ రఘునందన్ రావు విలేకర్లతో మాట్లాడుతూ.. దొంగ ఓట్లు ఎవరు చేశారో విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. ఈ తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. అయితే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. దొంగ ఓట్లు ఉన్నాయంటారని.. కానీ ఆయనే ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. మరి వాటిని ఎలా ఏరిపారేయాలో రాహుల్ గాంధీనే చెప్పాలని వ్యంగ్యంగా అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి రఘునందన్ రావు సూచించారు.
ఇక ఓట్ల చోరీపై బాధ్యత ఉన్న నేతలు సైతం కనీస బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఎందుకు అవసరమనే అంశంపై ఒక చిన్న ఉదాహరణ చెబుతానన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పటాన్‌చెరువులోని ఐలాపూర్‌లో ఒక చిన్న పొరపాటు జరిగిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు.. ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారని.. ఆ క్రమంలో ఐలాపూర్‌లో 700లకు పైగా దొంగ ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. దీనిపై అప్పుడే జిల్లా ఎలక్ట్రారల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు సైతం చేశామన్నారు.
అనంతరం ఆ గ్రామ మాజీ సర్పంచ్‌తో జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేయించామన్నారు. కానీ ఎటువంటి యాక్షన్ మాత్రం తీసుకోలేదని పెదవి విరిచారు. ఆ తర్వాత ఎమ్మార్వోకి సైతం ఫిర్యాదు చేశామని వివరించారు. ఆయన కూడా చర్యలు తీసుకోకపోవడంతో.. అప్పటి ఎన్నికల సంఘం సీఈవో వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశామని వివరించారు. శ్మశానానికి, స్కూల్‌కి సైతం డోర్ నెంబర్ కేటాయించారన్నారు. ఇప్పుడు పోలింగ్ స్టేషన్ల నెంబర్ల మార్చి.. రెండు ఉన్న పోలింగ్ స్టేషన్లను నాలుగుకు పెంచారని చెప్పారు. అధికారులు ఎవరైనా ఒక్క సారి ఐలాపూర్‌కి రండి.. అక్కడి పరిస్థితి ఏమిటో అర్థమవుతుందని తెలిపారు.
ఓటర్ల జాబితాను ఒక సారి పరిశీలించి.. రివిజన్ చేయాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. ఇక్కడ ఓటరు లిస్ట్‌ను ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమగ్ర సవరణ చేస్తుందని వివరించారు.
ఒక్క చిన్న గ్రామంలోనే ఇంత జరిగితే దేశంలో ఇంకెన్ని దొంగ ఓట్లు ఉంటాయంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు పెరిగిన ఓట్లపై రివిజన్ చేయాల్సిందన్నారు. రెండు ఓట్లు చూపించి రాహుల్ గాందీ అంత అరిచారని వ్యంగ్యంగా అన్నారు. తాను ఇన్ని ఓట్ల ఆధారాలతో మాట్లాడుతున్న కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం
వదంతులు నమ్మకండి.. అప్రమత్తమైన ప్రభుత్వం
Read latest Telangana News And Telugu News