Share News

Bhatti Meets Pooran Kumar Family: పూరన్ కుమార్ కుటుంబానికి డిప్యూటీ సీఎం పరామర్శ

ABN , Publish Date - Oct 13 , 2025 | 04:05 PM

సీఎం రేవంత్ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారని.. పూరన్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారని ఈ సందర్భండి భట్టి విక్రమార్క తెలిపారు. పూరన్ కుమార్ సహచరి ఐఏఎస్ అమనీత్‌ను పరామర్శించడానికి వచ్చిన హర్యానా చీఫ్ సెక్రటరీ అనురాగ్ రస్తోగితో డిప్యూటీ సీఎం విక్రమార్క మాట్లాడారు.

Bhatti Meets Pooran Kumar Family: పూరన్ కుమార్ కుటుంబానికి డిప్యూటీ సీఎం పరామర్శ
Bhatti Meets Pooran Kumar Family

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: చండీఘడ్‌లో ఆత్మహత్య చేసుకున్న దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఈరోజు (సోమవారం) పరామర్శించారు. పూరన్ కుమార్ సహచరి ఐఏఎస్ అమనీత్‌ను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పూరన్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పూరన్ కుమార్ సహచరి ఐఏఎస్ అమనీత్, కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడించారు ఉపముఖ్యమంత్రి.


సీఎం రేవంత్ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారని.. పూరన్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారని ఈ సందర్భండి భట్టి విక్రమార్క తెలిపారు. పూరన్ కుమార్ సహచరి ఐఏఎస్ అమనీత్‌ను పరామర్శించడానికి వచ్చిన హర్యానా చీఫ్ సెక్రటరీ అనురాగ్ రస్తోగితో డిప్యూటీ సీఎం విక్రమార్క మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి సూసైడ్ నోట్ ఆధారంగా ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించి పూరన్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.


పూరన్ కుమార్ అత్యంత ప్రతిభావంతుడని.. ప్రసిద్ధి గాంచిన ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పట్టభద్రుడని.. ఐఐఎం అహ్మదాబాదులో చదివిన గొప్ప మేధావి అని కొనియాడారు డిప్యూటీ సీఎం. ఉన్నతాధికారుల కుల వివక్ష, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం.. చాలా తీవ్రమైన అంశమన్నారు. పూరన్ కుమార్ సూసైడ్ నోట్ డైయింగ్ డిక్లరేషన్‌గా భావించాలని కోరారు. ఈ ఘటన జరిగి ఇన్ని రోజులు అయినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. వృద్ద తల్లిదండ్రులను, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న పూరన్ కుమార్ కుటుంబానికి రక్షణ కల్పించి ఆదుకోవాలని హర్యానా ప్రభుత్వాన్ని, చండీఘర్ పోలీసులను డిమాండ్ చేశారు. కపూర్ అనే అధికారి దళిత వ్యతిరేకి అని తెలిసి కూడా బీజేపీ ప్రభుత్వం అతన్ని డీజీపీని చేసిందని.. ఈ ప్రభుత్వం ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో డెత్ బెడ్ మీద ఉండి కూడా న్యాయం కోసం ప్రాధేయపడడం దురదృష్టం అంటూ భట్టి వ్యాఖ్యలు చేశారు.


అత్యంత పిన్న వయసులోనే ప్రెసిడెంట్ అవార్డు గ్రహీత పూరన్ కుమార్ అని అన్నారు. అతని చివరి డెత్ లెటర్ ఆధారంగా సంబంధిత అధికారుల మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. హర్యానా, చండీగఢ్ ప్రభుత్వాలు బీజేపీ పాలనలో ఉన్నాయని.. సీఎం రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నారు. తాము చట్టాన్ని ధిక్కరించే పని అడగడం లేదని.. బాధ్యత గల ప్రభుత్వాలు చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని అడుగుతున్నామన్నారు. తెలంగాణ సీఎం రేవంత్.. పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

సంక్షేమ హాస్టళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక సూచనలు

జూబ్లీహిల్స్ బైపోల్.. తొలిరోజు ఎంతమంది నామినేషన్లు వేశారంటే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 04:53 PM