Bandi Sanjay Warns Congress: బకాయిలు అడిగితే బ్లాక్ మెయిలా.. ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం
ABN , Publish Date - Oct 22 , 2025 | 09:22 AM
విద్యార్థులు, యాజమాన్యాలతో కలిసి మంత్రులను రోడ్లపై తిరగనీయమని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. యాజమాన్యాలూ..... ప్రభుత్వానికి భయపడి సమ్మె విరమిస్తే అంతే సంగతులు.. భవిష్యత్తులో ఎవరూ అండగా నిలబడే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 22: కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) అల్టిమేటం జారీ చేశారు. బకాయిలు చెల్లింపు విషయంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బకాయిలు అడిగితే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని... విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలరాస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. బకాయిలు చెల్లించాల్సిందే అంటూ పట్టుబడిన బండి సంజయ్.. ప్రభుత్వానికి పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.
మాట తప్పే వాళ్లనేమనాలి...
‘బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులతో బ్లాక్ మెయిల్ చేస్తారా? విద్యార్థులు, యాజమాన్యాల భవిష్యత్తుతో చెలగాటమాడతారా? బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకుంటామా? కమీషన్లు రావనే సాకుతో బకాయిలు చెల్లించడం లేదా? అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని కూడా కాలరాస్తారా? పదేపదే ఇచ్చిన మాటను తప్పే వాళ్లను ఏమనాలి? బీహార్ ఎన్నికలకు పైసలు ఇక్కడి నుండే పంపుతున్నారు కదా? విద్యార్థుల భవిష్యత్తు కోసం బకాయిలు చెల్లించలేరా? ఈసారి తక్షణమే బకాయిలు మొత్తం చెల్లించాల్సిందే.. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవు’ అంటూ హెచ్చరించారు.
విద్యార్థులు, యాజమాన్యాలతో కలిసి మంత్రులను రోడ్లపై తిరగనీయమని వార్నింగ్ ఇచ్చారు. యాజమాన్యాలూ..... ప్రభుత్వానికి భయపడి సమ్మె విరమిస్తే అంతే సంగతులు.. భవిష్యత్తులో ఎవరూ అండగా నిలబడే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలపైనా రోడ్డెక్కడం తథ్యమని వెల్లడించారు. మంత్రులు ప్రతి పనికి కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ సొమ్మును కాంగ్రెస్ హైకమాండ్‌కు కప్పం కడుతున్నారంటూ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాగా.. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని నల్లకుంట శంకర్‌మఠ్‌కు చేరుకున్న బండి సంజయ్.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రుంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతి స్వామి ఆశీస్సులను కేంద్రమంత్రి అందుకున్నారు.
ఇవి కూడా చదవండి...
కొత్త రైళ్లు ఇప్పట్లో లేనట్లే...
దారుణం.. కొడుకు చేతిలో తండ్రి హతం
Read Latest Telangana News And Telugu News