Ex MP on Jubilee Hills election: నా కన్నా సీనియర్లు లేరు.. నాకు అన్ని అర్హతలు..
ABN , Publish Date - Sep 13 , 2025 | 07:47 PM
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించారు. ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన అనంతరం రేవంత్ కేబినెట్‌లో చోటు ఇవ్వాలన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 13: మరికొన్ని నెలల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలో విజయం సాధించాలని తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీలు తమదైన శైలిలో వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అలాంటి వేళ.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఇవాళ(శనివారం) హైదరాబాద్‌లో విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తాను పోటీలో ఉన్నానని ప్రకటించారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా గతంలో రెండు సార్లు గెలిచినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో సదరు అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేసినట్లు చెప్పుకొచ్చారు.
ప్రత్యేక నిధులు కేటాయించి మరీ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. తన సామాజిక వర్గానికి రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి ఇవ్వాలని.. అందులో భాగంగా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి పదవి కేటాయించాలంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించిన విషయాన్ని అంజన్ కుమార్ యాదవ్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో తనకన్నా సీనియర్లు ఎవరూ లేరని.. ఈ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల బరిలో దిగేందుకు తనకు అన్ని అర్హతలున్నాయన్నారు. హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదు కాబట్టి తనకు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించి.. మంత్రి పదవిని సైతం తనకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. ఇక తన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్‌కి యూత్ కాంగ్రెస్ కోటాలో రాజ్యసభకు పార్టీ అగ్రనాయకత్వం పంపిందని వివరించారు. అతడు నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు.
తాను, తన కుమారుడు పారాచూట్ లీడర్లం కాదంటూ కుండ బద్దలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేశామని చెప్పుకొచ్చారు. కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నానని.. ఆ క్రమంలో తనకు ఈ ఉప ఎన్నికలో అభ్యర్థిగా కాంగ్రెస్ అవకాశం ఇవ్వాలని అగ్రనాయకత్వానికి కీలక సూచన చేశారు. జూబ్లీహిల్స్‌లో సర్వే చేస్తే తన పేరు ప్రజల నుంచి వస్తుందంటూ ఈ సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంచినీళ్ల కోసం వెళ్లిన మహిళలు.. అది చూసి పరుగో పరుగు..
ఇంట్లోంచి పెద్దగా అరుపులు.. లోపలికెళ్లి చూడగా షాక్..
For More TG News And Telugu News