Aman Preet Singh Case: అమన్ ప్రీత్ సింగ్ కోసం గాలింపు
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:05 PM
టాలీవుడ్ ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నార్సింగ్ పోలీసులతోపాటు ఈగల్ టీం పోలీసులు బృందాలుగా విడిపోయి.. అతడి కోసం గాలిస్తున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్, డిసెంబర్ 28: డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ కోసం గాలింపు చర్యలను ఈగల్ టీం ముమ్మరం చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో అతడి కోసం గాలిస్తోంది. నెలలో ఆరు సార్లు అతడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఈగల్ టీం తాజాగా గుర్తించింది. డ్రగ్ పెడ్లర్ నితీన్ సింఘానియాతో డ్రగ్స్ కోసం కోడ్ లాంగ్వేజ్‌లో అమన్ సింగ్ చాట్ చేసినట్లు ఈగల్ టీం అధికారులు నిర్ధారించారు. నార్సింగ్ డ్రగ్స్ కేసులో ఆమన్ సింగ్ నిందితుడిగా ఉన్నారు. అతడు రెండో సారి డ్రగ్స్‌తో పట్టుబడడంతో అతడిపై పెడ్లర్‌గా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడైన అమన్ ప్రీత్ సింగ్ కోసం నార్సింగ్, ఈగల్ టీంలోని సభ్యులు బృందాలుగా ఏర్పడి.. గాలింపు చర్యలు చేపట్టారు.
డిసెంబర్ 19వ తేదీన మలక్‌పేట్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి నితీన్ సింఘానియాతోపాటు మరో వ్యక్తి డ్రగ్స్ విక్రయిస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో వారి వద్ద నుంచి 49 గ్రాముల కొకైన్‌తోపాటు 11 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సెల్ ఫోన్ల కాల్ డేటాను పరిశీలించారు. ఈ డేటాలో అమన్ ప్రీత్ సింగ్ పేరు సైతం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారం రోజుల్లో అతడు పలుమార్లు వీరు వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు కనుగొన్నారు.
గతంలో డ్రగ్స్ కేసులో నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పై కేసు నమోదు అయింది. ఈ కేసులో అతడికి బెయిల్ మంజూరైంది. అయినప్పటికీ అతడు పద్దతి మార్చుకోకుండా.. డ్రగ్స్ కొనుగోలు చేయడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో అతడిని ఏ7 నిందితుడిగా పోలీసులు చేర్చారు. గత కొద్ది ఏళ్లుగా ఈ డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు పోలీసుల గుర్తించారు.
అంతేకాకుండా.. ఈ డ్రగ్స్ పెడ్లర్లకు అత్యధిక సార్లు అమన్ ప్రీత్ సింగ్ ఫోన్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. రూ.లక్షల కొద్దీ నగదు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు కనుగొన్నారు. ఇక అమన్ ప్రీతి సింగ్ చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి కూడా కావడంతో.. సదరు పరిశ్రమలో ఎవరి కోసమైనా ఈ డ్రగ్స్ అతడు కొనుగోలు చేశాడా? అనే కోణంలో ఈ కేసును ఈగల్ టీం దర్యాప్తు చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కల్వర్టులోకి దూసుకెళ్లిన బైక్.. యువకులు దుర్మరణం..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీరు ఎక్కవలసిన రైలు మిస్సయ్యిందా..?
For More TG News And Telugu News