Alai Balai Celebrations: అలయ్ బలయ్ సంప్రదాయం కాదు.. తెలంగాణ ఆత్మ: బండారు దత్తాత్రేయ
ABN , Publish Date - Oct 03 , 2025 | 03:17 PM
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
హైదరాబాద్, అక్టోబర్ 03: నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం ఇవాళ (శుక్రవారం) ఉదయం ప్రారంభమైంది. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ కట్టర్, కిషన్ రెడ్డి, అర్జున్ రామ్ మేఘ్వాల్, జయంతి చౌదరి, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీపీఐ నేత నారాయణ, ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎంపీ వి.హనుమంతావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, టాలీవుడు ప్రముఖ నటులు నాగార్జున, బ్రహ్మానందం తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యత కోసం బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా దసరా మరునాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతి, ఆహారపు అలవాట్లను చాటిచెప్పేలా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి మాత్రం ఆపరేషన్ సిందూర్ థీమ్‌తో ఈ కార్యక్రమం జరుగుతోంది.
తెలంగాణ ఆత్మ..
అలయ్ బలయ్ ఒక సంప్రదాయం మాత్రమే కాదని.. తెలంగాణ ఆత్మని ఈ కార్యక్రమం నిర్వాహకులు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. స్వదేశీ భావనతో ముందుకు వెళ్లాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేయాలంటూ రైతులకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్రలో ప్రతీ మార్పులో యువత కీలకపాత్ర పోషించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బండారు దత్తాత్రేయ సూచించారు.
పరిపాలన సౌలభ్యం కోసమే..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పరిపాలన సౌలభ్యం కోసమే రాష్ట్రాల విభజన జరిగినట్లు పేర్కొన్నారు. ప్రాంతాలకు అతీతంగా కలిసికట్టుగా ఉండాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు పిలుపు నిచ్చారు. యువత సనాతన ధర్మం వైపు చూస్తుందన్నారు. మనకు దసరాతోపాటు జీఎస్టీ పండగ వచ్చిందని తెలిపారు. పెరిగిన ధరలు తగ్గించి ప్రధాని మోదీ రికార్డు సృష్టించారని చెప్పారు. దసరా రోజు అందరి నుంచి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. అయితే బయట రాజకీయ నేతలు చాలెంజ్‌లు విసురుకుంటారు.. కానీ పండగ పూట ఒకే వేదికపైకి తీసుకు వచ్చి కలుసుకునే విధంగా ఏర్పాటు చేసిన కార్యక్రమమే అలయ్ బలయ్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.
ఇవి కూడా చదవండి...
పెదనాన్న అవమానం.. బాలిక ఆత్మహత్య
హైదరాబాద్‌లో పర్యటించనున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్..
Read Latest TG News And Telugu News