Telangana BC Reservation: మాది న్యాయబద్ధమైన కోరిక.. 42శాతం రిజర్వేషన్‌పై పీసీసీ చీఫ్
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:42 PM
పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం బాధాకరమని పీసీసీ చీఫ్ అన్నారు. పూర్తి వివరాలతో హైకోర్టులో వాదించినప్పటికీ స్టే విధించారని తెలిపారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 14: తెలంగాణ ప్రభుత్వం ఓబీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొచ్చిందని.. 42% కోసం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో చారిత్రాత్మకమని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజల జీవితాలు బాగుపరచాలని చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. అడుగడుగున బీజేపీ, బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తూ వచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ వెనక్కు తగ్గలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృతంలో ముందుకు వెళ్లామని చెప్పారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లేందుకు పూర్తి వివరాలతో హైకోర్టులో వాదించామని.. కానీ రాష్ట్ర హైకోర్టు జీవో 9 పై స్టే విధించిందన్నారు.
పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం బాధాకరమని పీసీసీ చీఫ్ అన్నారు. పూర్తి వివరాలతో హైకోర్టులో వాదించినప్పటికీ స్టే విధించారని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎస్ఎల్పీ దాఖలు చేశామని.. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో దాదాపు గంట పాటు చర్చించినట్లు చెప్పారు. అన్ని విషయాలను కూలంకుషంగా చర్చించామన్నారు. గురువారానికి (ఈనెల 16) కేసు విచారణకు వచ్చే అవకాశం ఉందని అన్నారు.
హైకోర్టు పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని చెప్పిన నేపథ్యంలో బాధతో సుప్రీంకోర్టుకు వచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని.. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే విధంగా అసెంబ్లీలో బిల్లు పెడతే అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని.. కానీ ఇప్పుడు మాట మార్చి బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. 42% రిజర్వేషన్లు ఎక్కడా తగ్గకుండా ముందుకు వెళ్తున్నామని.. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. తమది న్యాయబద్ధమైన కోరిక అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
కాగా.. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో మహేష్ గౌడ్ ఈరోజు (మంగళవారం) భేటీ అయ్యారు. 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం తరఫున గట్టి వాదనలు వినిపించాలని సీనియర్ న్యాయవాదిని మహేష్ కుమార్ గౌడ్ కోరారు.
ఇవి కూడా చదవండి..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బయటపడ్డ బోగస్ ఓట్లు
ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయండి.. సుప్రీం ఆదేశం
Read Latest Telangana News And Telugu News