Share News

Phone Tapping Case: ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయండి.. సుప్రీం ఆదేశం

ABN , Publish Date - Oct 14 , 2025 | 01:07 PM

మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ పొడిగించిన సుప్రీం కోర్టు. తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది.

Phone Tapping Case:  ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయండి.. సుప్రీం ఆదేశం
Phone Tapping Case

న్యూఢిల్లీ , అక్టోబర్ 14: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు (Phone Tapping Case) సంబంధించి సుప్రీం కోర్టులో (Supreme Court) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలని సుప్రీం ఆదేశించింది. అలాగే ప్రభాకర్ రావుకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ పొడిగించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది.


ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఈరోజు (మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినించారు. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు కేసు దర్యాప్తుకు సహకరించడం లేదని.. ఆయనను కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు అప్పగించాలని కోర్టుకు తెలిపారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ ద్వారానే నిజాలు బయటికి వస్తాయన్నారు. డిజిటల్ డివైసెస్‌లో డాటా ఫార్మా చేశారని.. ఐ ఫోన్, ఐ క్లౌడ్ పాస్వర్డ్ ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం మారగానే హార్డ్ డిస్క్లలో డేటా ధ్వంసం చేసినట్లు న్యాయవాదులు తెలియజేశారు. కొత్తగా 50 హార్డ్ డిస్కులు అక్కడ పెట్టారన్నారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, జడ్జిలు, బిల్డర్లు, వ్యాపారుల ఫోన్లో టాప్ చేశారని సుప్రీంలో వాదనలు వినిపించారు. నక్సలైట్ల పేరుతో ఈ కార్యక్రమాలన్నీ చేసినట్లు తెలిపారు. డేటా మొత్తం డిలీట్ చేసి డివైసెస్ తమకు ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదించారు.


అలాగే.. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు తరఫున న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావు డివైస్ రీసెట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఆయనను 11సార్లు పిలిపించి 80 గంటల పాటు విచారణ జరిపినట్లు తెలిపారు. డేటాను ప్రభాకర్ డిలీట్ చేయలేదని డిపార్ట్మెంట్ డిలీట్ చేసిందని చెప్పారు. ప్రభాకర్ డిపార్ట్‌మెంట్‌లో ఒకరు కాదని..ఆయన్ను పెడతానని ముఖ్యమంత్రి బాహటంగా బెదిరించారంటూ అంటూ లాయర్ వాదనలు వినిపించారు.


ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు... ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలి ఆదేశిస్తూ.. ప్రభాకర్ రావుకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణను పొడిగించింది. ఈకేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు నవంబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి..

వైన్ షాపులపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బయటపడ్డ బోగస్ ఓట్లు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 01:32 PM