Hyderabad: చలితో నగరవాసులు గజ.. గజ
ABN , Publish Date - Dec 13 , 2025 | 07:48 AM
చలిపులి చంపేస్తోంది. హైదరాబాద్ నగరంలో అత్యల్ప స్థాయికి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే వణికిపోవాల్సిన పరిస్థిది నెలకొంది. ప్రధానంగా చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లు ఈ చలిపుటి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
- శేరిలింగంపల్లిలో అత్యల్ప స్థాయికి ఉష్ణోగ్రతలు
- పదేళ్ల తర్వాత ఆ స్థాయిలో దిగువకు
- చలితో వణుకుతున్న నగరవాసులు
- మల్కాజిగిరిలో 7.1 డిగ్రీలు
- రహదారులను కప్పేస్తున్న మంచు
- శివారుల్లో సాధారణం కంటే 4-6 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ సిటీ: చలితో నగరవాసులు గజ..గజలాడుతున్నారు. గ్రేటర్‌లో రికార్డుస్థాయిలో పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలతో శివారు ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున శేరిలింగంపల్లిలో రికార్డుస్థాయిలో 6.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2015 డిసెంబర్ 1న మారేడ్‌పల్లిలో అత్యల్పంగా 6.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా సుమారు పదేళ్లతర్వాత నమోదైన అత్పల్ప ఉష్ణోగ్రతలు ఇవేనని తెలంగాణ డెవల్‌పమెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారులు పేర్కొన్నారు. తెల్లవారుజామున వీస్తున్న చలిగాలులతో నగరవాసులు బయటకు వచ్చేందుకు వణికిపోతున్నారు. రెండురోజులుగా చలిగాలుల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లు చలిని తట్టుకునేలా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

సాధారణం కంటే తక్కువ
గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 4-6 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి.రాత్రివేళల్లో ద్విచక్రవాహనాలపై వెళ్లే వాహనదారులు చలిగాలుల తీవ్రతకు అనారోగ్యం బారిన పడుతున్నారు. తెల్లవారుజామున రహదారులను మంచు కప్పేయడంతో వాహనదారులు రోడ్లపై ముందుకు వెళ్లేందుకు ఇబ్బందులుపడుతున్నారు. మరో రెండురోజుల పాటు ఇదే తరహా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

పలు ప్రాంతాల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
(శుక్రవారం తెల్లవారుజామున)
ప్రాంతం - - ఉష్ణోగ్రతలు
శేరిలింగంపల్లి 6.3
మల్కాజిగిరి 7.1
రాజేంద్రనగర్ 7.7
అల్వాల్ 9.0
చందానగర్ 9.1
సికింద్రాబాద్ 10.1
కుత్బుల్లాపూర్ 10.2
ఫలకునుమా 10.9
ఈ వార్తలు కూడా చదవండి..
చదవడం లేదని..బాలుడిని అట్లకాడతో కాల్చిన ట్యూషన్ టీచర్
Read Latest Telangana News and National News