Captain Deepika: మా ఊరికి రోడ్డు వేయరూ..
ABN , Publish Date - Dec 13 , 2025 | 06:23 AM
తమ ఊరికి రహదారి సౌకర్యం కల్పించాల ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు అంధుల టీ-20 క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక విజ్ఞప్తి చేశారు.
డిప్యూటీ సీఎంకు ‘కెప్టెన్ దీపిక’ వినతి
సాయంత్రానికల్లా పాలనా అనుమతులు
మడకశిర, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తమ ఊరికి రహదారి సౌకర్యం కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు అంధుల టీ-20 క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలో డిప్యూటీ సీఎంను టీ-20 ప్రపంచ కప్ సాధించిన జట్టుతో ఆమె శుక్రవారం కలిశారు. ఈ విజయం దేశానికే గర్వకారణం అని పవన్ కల్యాణ్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా కెప్టెన్ దీపిక ‘మా ఊరికి రోడ్డు సౌకర్యం కల్పించండి’ అని విజ్ఞప్తి చేశారు. దీపిక స్వగ్రామం శ్రీసత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి పంచాయతీలోని తంబాలహట్టి. దీపిక విజ్ఞప్తి చేసిన రహదారి నిర్మాణంపై, అల్లూరి జిల్లాకు చెందిన మరో క్రికెటర్ కరుణ ఇంటి కోసం చేసిన వినతిపైనా పవన్ సానుకూలంగా స్పందించారు. శుక్రవారం మధ్యాహ్నం కెప్టెన్ దీపిక రహదారి కోసం చేసిన వినతిపై పవన్ కల్యాణ్ అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గంటల వ్యవధిలోనే శ్రీ సత్యసాయి జిల్లా అధికారులు తంబలహట్టి రోడ్లను పరిశీలించారు. హేమావతి నుంచి గ్రామం వరకూ రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహట్టి వరకూ 5 కి.మీ. రహదారి నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించారు. వెంటనే ఆమేరకు అనుమతులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.