Child Abuse: చదవడం లేదని..బాలుడిని అట్లకాడతో కాల్చిన ట్యూషన్ టీచర్
ABN , Publish Date - Dec 13 , 2025 | 06:00 AM
ఏడేళ్ల బాలుడు చదవడం లేదని ఉపాధ్యాయురాలు అట్లకాడతో కాల్చింది. దీంతో ఆ బాలుడు తల్లడిల్లిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా...
బంజారాహిల్స్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఏడేళ్ల బాలుడు చదవడం లేదని ఉపాధ్యాయురాలు అట్లకాడతో కాల్చింది. దీంతో ఆ బాలుడు తల్లడిల్లిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గణపతి నగర్‌కు చెందిన వల్లు సత్తిబాబు కుటుంబంతో నగరానికి వలస వచ్చాడు. ఓయూ కాలనీలోని రిలయన్స్ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వెంకటేష్, తేజానందన్ అనే ఇద్దరు కుమారులున్నారు. వెంకటేష్ 4వ తరగతి చదువుతుండగా తేజానందన్ ఫస్ట్‌క్లాస్ చదువుతున్నాడు. నాలుగు నెలలుగా అపార్ట్‌మెంట్‌లో నివాసముండే శ్రీమానస వద్దకు ఇద్దరూ ట్యూషన్‌కు వెళుతున్నారు. ఈ నెల 11న కూడా ఇద్దరు స్కూల్ నుంచి వచ్చి ట్యూషన్‌కు వెళ్లారు. కొద్ది సేపటికి వెంకటేష్ ఇంటికి వచ్చి తేజానందన్‌ను తీసుకువెళ్లేందుకు టీచర్ రమ్మంటుందని సత్తిబాబుకు చెప్పాడు. సత్తిబాబు, అతని భార్య ట్యూషన్ దగ్గరకు వెళ్లగా తేజానందన్ ఏడుస్తూ కనిపించాడు. పరిశీలించగా అతని రెండు చేతులు, కాలి తొడపై కాలిన గాయాలు కనిపించాయి. ట్యూషన్ టీచర్ అట్ల కాడతో వాతలు పెట్టినట్టు తేలింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.