Metro Trains: రద్దీగా మెట్రో రైళ్లు.. ఒక్కరోజే 5.10 లక్షల మందికిపైగా..
ABN , Publish Date - Oct 09 , 2025 | 10:03 AM
ఒకవైపు వర్షాలు.. మరోవైపు భారీగా ట్రాఫిక్ జామ్‌లు.. నగరంలో అడుగు ముందుకు వేయాలంటే అడుగడుగునా అడ్డంకులు. ఐటీ కారిడార్‌లోనే కాకుండా కోర్ సిటీలోనూ ట్రాఫిక్ జామ్‌లు, ధ్వంసమైన రోడ్లపై ప్రయాణం నరకరంగా మారింది.
వర్షంతో రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు
మెట్రోలో ప్రయాణానికే నగర వాసుల మొగ్గు
హైదరాబాద్ సిటీ: ఒకవైపు వర్షాలు.. మరోవైపు భారీగా ట్రాఫిక్ జామ్‌లు.. నగరంలో అడుగు ముందుకు వేయాలంటే అడుగడుగునా అడ్డంకులు. ఐటీ కారిడార్‌లోనే కాకుండా కోర్ సిటీలోనూ ట్రాఫిక్ జామ్‌లు, ధ్వంసమైన రోడ్లపై ప్రయాణం నరకరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో రైలు అనుకూల ప్రజా రవాణా సాధనంగా మారింది. మూడు రోజులుగా మెట్రో రైళ్లు ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తున్నాయి. సోమవారం మెట్రోలో 5.10 లక్షల మంది, మంగళవారం 4.90 లక్షల మంది ప్రయాణించారని అధికారులు తెలిపారు.
ఉదయం 8 నుంచి 11, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు మెట్రో రైళ్ల(Metro trains)లో రద్దీ అధికంగా ఉంటుందన్నారు. ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తే గంటల తరబడి ట్రాఫిక్‌లోనే ఉండాల్సి వస్తోంది. మెట్రో రైలులో ప్రయాణం చేస్తే చేరాల్సిన గమ్యస్థానానికి నిర్ణీత సమయంలో చేరుకోవచ్చని నగర వాసులు భావిస్తున్నారు.

అధిక సంఖ్యలో ఐటీ ఉద్యోగులు
ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎక్కువగా మెట్రో రైళ్లలోనే ప్రయాణం చేస్తున్నారు. ఇటీవల సైబరాబాద్(Cyberabad) పరిధిలో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికి తోడు తరచూ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమై గంటల తరబడి రోడ్లపై వరద నీరు నిలిచిపోతోంది.
దీంతో రాయదుర్గం మైండ్‌స్పేస్ జంక్షన్, హైటెక్‌సిటీ సైబర్ టవర్స్, దుర్గం చెరువు ప్రాంతాల్లో ఉన్న మెట్రోస్టేషన్‌ల నుంచి లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం సుమారు 2-3 లక్షల మంది ఐటీ ఉద్యోగులు మెట్రో రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. రద్దీకి అనుగుణంగా నాగోల్-రాయదుర్గం మెట్రో మార్గంలో రైళ్లను నడుపుతున్నామని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారత్ దాల్.. అంతా గోల్‌మాల్!
Read Latest Telangana News and National News